మాతృమూర్తి భౌతికంగా దూరమై సరిగ్గా ఏడాది కాలం..చిత్రపటాలు, అమ్మ పంచిన అమృతమంటి ప్రేమ మాత్రమే ఆమె జ్ఞాపకాలు.. అప్పుడప్పుడు అమ్మ పంచిన ఆప్యాయతలే తలపులు..ఇవీ ఆ కుమారుడికి మిగిలింది. అయితే ఉన్నట్టుండి ఆయనకో తియ్యని కబురు వచ్చింది తమ తల్లి భౌతికకాయం కాటూరు వైద్య కళాశాల్లో కనిపించిందని. ఆ మాట చెప్పిన వెంటనే సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే కళాశాలకు వెళ్లి మాతృమూర్తి భౌతికకాయాన్ని మనసారా చూసుకున్నాడు ఆమె పంచిన ప్రేమ మదిలో మెదలగా చెమర్చిన కళ్లు తుడుచుకుంటూ.
యడ్లపాడు(చిలకలూరిపేట): తల్లి మృతి చెందిన ఏడాది తర్వాత ఆమె భౌతికకాయాన్ని కుమారులు తిరిగి చూసుకోగలిగారు. యడ్లపాడు ఎర్రచెరువులో ఉంటున్న కేతు వెంకాయమ్మ (85) అనారోగ్యంతో గతేడాది డిసెంబర్ 20న మృతి చెందింది. ఆమె మరణానంతరం కుమారుడు రామబ్రహ్మం మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కాటూరి మెడికల్ కళాశాలకు అప్పగించారు.
ప్రదర్శనల వల్ల తల్లిని చూడగలిగారు...
కాటూరి వైద్యశాలలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళ్లిన అనేక మంది రామబ్రహ్మం తల్లి భౌతికకాయాన్ని చూసి గుర్తు పట్టారు. వెంటనే కొడుకు రామబ్రహ్మంకు చెప్పడంతో మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి తల్లి భౌతికకాయాన్ని చూసుకున్నారు. ఆనందంతో తల్లి ప్రేమను మరొక్కసారి గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment