సైలెన్సర్లను మార్పు చేసిన బుల్లెట్లు
మామూలు శబ్దం కాదు.. తుపాకీ నుంచి తూటా దూసుకొచ్చినంత సౌండ్. రాకెట్‌లాగా నిప్పులు చిమ్ముకుంటూ ప్రయాణం.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగం.. అంతా కుర్రకారే.. రేసుల కోసం.. ప్రత్యేక ఆకర్షణ కోసం.. ప్రజలకు దడ పుట్టిస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు వింతైన సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్‌చల్ చేస్తున్నారు.
తెనాలిలోని ఓ వ్యాపారి తన కుమారుడు బీటెక్ పూర్తి చేసిన ఆనందంలో అతని కోరిక మేరకు బుల్లెట్ కొనిచ్చాడు. అప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి ఓ మెకానిక్ అధిక శబ్దంతో పాటు నిప్పులు చెరిగే సైలెన్సర్లు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న యువకుడు నేరుగా అక్కడకు వెళ్లి మెకానిక్ కోరినంత డబ్బు ఇచ్చి నిప్పులు చెరిగే సైలెన్సర్‌ను వాహనానికి బిగించుకున్నాడు. దీంతో రాత్రి వేళల్లో ప్రధాన రహదారులపై హల్‌చల్ చేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ బుల్లెట్ వెళుతుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ.. రోడ్డు పక్కకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు బైక్ రేసులకు రహస్యంగా వెళ్లడం ప్రారంభించాడు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న గుంటూరు జిల్లాలో గడచిన నాలుగేళ్లలో యువతలో బుల్లెట్ల క్రేజ్ పెరిగింది. అధునాతనంగా తీర్చిదిద్దిన వాహనానికి అదనపు హంగులు కోసం ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో కొందరు మెకానిక్‌లు వారిదైన శైలిలో యువత మోజును క్యాష్ చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే మరి కొందరు జిల్లాలోనే నకిలీ సైలెన్సర్లను తయారు చేసి గుట్టుగా విక్రయాలు చేస్తున్నారు.
మార్పులు ఇలా...
జిల్లా వ్యాప్తంగా గడచిన నాలుగేళ్లలో ప్రతిఏటా సగటున 700 బుల్లెట్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. అధికంగా యువత వాటినే కొనుగోలు చేసేందుకు ఆసకి చూపుతున్నారు. వాహన కొనుగోలు చేసిన అనంతరం బుల్లెట్‌కు నిబంధనల ప్రకారం 70 నుంచి 80 డెసిబుల్స్ లోపు శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేస్తారు. అయితే వాటిని తొలగించి వాటి స్థానంలో 90 నుంచి 160 డెసిబుల్స్ సౌండ్ వచ్చే వాటిని బిగించుకుని హంగామా సృష్టిస్తున్నారు. అయితే వీటితో పాటు పటాకా పేరుతో నూతనంగా మార్కెట్‌లోకి మంటలు వచ్చే సైలెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి. రకాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.28 వేల వరకు మెకానిక్‌లు వసూలు చేస్తున్నారు. వాటితో పాటు అధిక శబ్దం వచ్చే విధంగా హారన్‌లను బిగిస్తున్నారు. ఇలా అదనపు హంగులను ఏర్పాటు చేసుకుంటున్న యువత రహస్యంగా బైక్ రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెలలో విజయవాడలో బైక్ రేస్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కొందరు మెకానిక్‌లు తమిళనాడు, తెలంగాణ, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఆర్డర్‌లపై సైలెన్సర్లను తెప్పించి విక్రయిస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలో నకిలీ సైలెన్సర్ల తయారీ..
ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న మంగళగిరి, తాడేపల్లి మండలాలను బైక్ రేసులకు అనువైన ప్రాంతంగా యువత ఎన్నుకొంటోంది. ఈ క్రమంలోనే కొందరు వ్యాపారులు ఏకంగా విజయవాడ, తాడేపల్లి, మంగళగిరితో పాటు తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో నకిలీ సైలెన్సర్లను తయారు చేస్తూ విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న సైలెన్సర్లు అధిక రేటు కావడంతో యువత తక్కవ ధరకు వచ్చే వాటిని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ వ్యాపారి నకిలీలను తనకు నమ్మకమైన మెకానిక్‌లకు మాత్రమే అమ్ముతున్నట్టు సమాచారం. తెనాలిలో ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ కానిస్టేబుల్ చెందిన దుకాణంలో మెకానిక్ విజయవాడ నుంచి సైలెన్సర్లను తెప్పించి మరీ విక్రయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. భారీ శబ్దం వచ్చే హారన్‌లు, సైలెన్సర్లను బిగించి వాహనాలతో రోడ్లపై యువత హల్‌చల్ చేస్తున్నారు. ఫలితంగా తోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక గుండెపోటు వున్న వారి సంగతి అంతే. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రవాణా, పోలీస్, శబ్ద కాలుష్యం శాఖల మధ్య సమన్వయం లోపంతో యువత ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment