అనంతపురంలోని రెడ్‌జోన్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్సలందిస్తున్న వైద్యుడు
అనంతపురం హాస్పిటల్: కరోనా కలకలం నేపథ్యంలో ప్రభుత్వం, ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రధానంగా కరోనా వ్యాప్తి చెందకుండా రెడ్‌జోన్ ప్రాంతాల్లోని వారికి ఎప్పటికప్పుడు వైద్య సేవలందించేందుకు వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పాటు రెడ్‌జోన్ ప్రాంతాల్లోని 8 వేల మందికి, వారికి సేవలందించే వైద్యులు, పోలీసులు తదితర సిబ్బందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు.
దీర్ఘకాలిక వ్యాధులకూ చికిత్స
జిల్లాలో 29 రెడ్‌జోన్‌లు ఉండగా.. ఆరోగ్యశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వైద్యులు, ఆశా, ఏఎన్‌ఎం, వలంటీర్లతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక, సాధరణ జబ్బులతో బాధపడే వారికి ఈ శిబిరాల్లోనే వైద్యం అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే సంబంధిత సీనియర్ వైద్యులు హాజరై చికిత్సనందిస్తారు. కరోనా అనుమానిత లక్షణాలుంటే నిర్ధారణ పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే స్థానికంగా విధుల్లో ఉండే పోలీసులు, తదితర సిబ్బందికీ ఇక్కడ వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు.
7,190 మందికి పరీక్షలు
రెడ్‌జోన్ ప్రాంతాల్లోని 7,190 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరితో పాటు కరోనా లక్షణాలు కల్గిన 964 మందికి, ఆ ప్రాంతంలో ఉండే 4,438 మంది ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అనుమానిత కేసులను క్వారన్‌టైన్‌కు పంపి సేవలందించారు.
మెరుగైన వైద్యం
కలెక్టర్ ఆదేశాలతో రెడ్‌జోన్‌ల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. దీర్ఘకాలిక సమస్యలుంటే మా దృష్టికి తీసుకువస్తారు. ఆ తర్వాత సంబంధిత వైద్య నిపుణులతో వైద్యం అందిస్తాం. ఈక్లినిక్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. –కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, జిల్లా వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment