ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ధ్వంసం చేసిన ట్రాన్స్‌ఫార్మర్
అనంతపురం, కంబదూరు: తను ఏమి చేసినా.. ఎలా చేసినా అడిగేవారు లేరన్న ధీమాతో ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ అడ్డదిడ్డంగా ముందుకెళ్తోంది. తమ పనికి ఎటువంటి అడ్డం లేకున్నా ఓ రైతు పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించేసింది. విద్యుత్ సరఫరా బంద్ కావడంతో ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని రైతుల పంటలు నీరందక నిలువునా ఎండిపోతున్నాయి. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం నుంచి వైసీ పల్లి వరకు రెండు లేన్ల తారు రోడ్డు వేస్తున్నారు. ఈ పనులను ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ చేస్తోంది. అయితే దేవేంద్రపురం – వైసీ పల్లి గ్రామాల మధ్యలో రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడ్డూ లేకున్నా రైతు వేణుగోపాల్ పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను, విద్యుత్ స్తంభాలను రాత్రికి రాత్రే గుట్టుచప్పుడుగా తొలగించేశారు.
పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు
ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో మూడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రైతులు వేణుగోపాల్ పది ఎకరాలు, లక్ష్మమ్మ ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేయగా.. కృష్ణానాయక్ ఐదు ఎకరాల్లో టమాట పెట్టాడు. రాత్రికి రాత్రే ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలను తొలగించేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైతులు సంబంధిత కాంట్రాక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకుంటే మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చారు. 15 రోజులు గడిచినా దాని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం సాగులో ఉన్న వేరుశనగ, టమాట పంటలు నీరందక ఎండుముఖం పట్టాయి. రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లుతోందని రైతు వేణుగోపాల్‌రెడ్డి ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.
అనుమతి లేకుండానే తొలగింపు..
ట్రాన్స్‌ఫార్మర్ తొలగింపునకు ఎటువంటి అనుమతీ పొందలేదని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండానే తొలగించారని తెలిపారు. ఇదే విషయమై ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాసులును వివరణ కోరగా.. ఇంతవరకూ తమ దృష్టికి రాలేదన్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం అన్యాయం
ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ వారు రోడ్డు నిర్మాణానికి ఎలాంటి అడ్డు లేకున్నా ట్రాన్స్‌ఫార్మర్‌ను, విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేయడం అన్యాయం. సంబంధిత రైతుకు çకనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించడం సరికాదు. కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల రైతు సాగు చేసిన పంట దెబ్బతింది. అ«ధికారులు కూడా కాంట్రాక్టర్‌కు వత్తాసు పలికి రైతుకు అన్యాయం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.
– తిరుపాల్, మాజీ సర్పంచ్, రాంపురం
Comments
Please login to add a commentAdd a comment