అనిరుధ్‌బాబుకు మిఠాయి తినిపిస్తున్న కుటుంబ సభ్యులు
పాతపట్నం : నీట్ ఫలితాల్లో మెరిసిన పాతపట్నం కుర్రోడు అంకడాల అనిరుధ్‌బాబు మరోసారి మెరిశాడు. జవహార్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యూయేట్ మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మెర్)–2018 ఫలితాల్లో పాతపట్నం మేజర్ పంచా యతీ శాంతినగర్–3వలైన్‌కు చెందిన అంకడాల తేజేశ్వరరావు తనయుడు అనిరు«ధ్‌బాబు ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదల అయ్యాయి.
ఇటీవల నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ (నీట్) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో కూడా మొదటి ర్యాంకు, ఆలిండియాలో స్థాయిలో అనిరుధ్ 8వ ర్యాంకు సాధించాడు. నీట్‌లో 720కి 680 మార్కులు సాధించిన అనిరుధ్‌బాబు.. ఏపీ ఎంసెట్‌లో 14వ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంటర్‌ను విజయవాడలోని శ్రీ చైతన్యలో చదివి 983 మార్కులు సంపాదించాడు. పాతపట్నం సెంటెన్స్‌లో 7వ తరగతి వరకు, 8 నుంచి పదో తరగతి వరకు విశాఖపట్నంలోని బోయపాలెంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో అభ్యసించాడు.
తండ్రి అంకడాల తేజేశ్వరరావు మెళియాపుట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లెక్కలు ఉపాధ్యాయుడుగా పని చేస్తుండగా.. తల్లి రమాదేవి గృహిణి. స్వగ్రామం మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామం కాగా.. ఆరు సంవత్సరాల క్రితం పాతపట్నం వచ్చేసి స్థిరపడ్డారు. ఆలిండియా స్థాయిలో ప్రథముడిగా నిలిచిన అనిరుధ్‌బాబుకు తల్లిదండ్రులు మిఠాయిలు తినిపించి ఆనందం పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment