
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా శ్రీవా.. ఆలయంలో శనివారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 5.48 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రంలో అర్చకులు ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శనివారం తొమ్మిది రోజుల బ్రహ్మో త్సవానికి నాందిగా ఆలయ సంప్రదా యం ప్రకారం కంకణం ధరించారు. ఈ కార్యక్రమంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో రవికృష్ణ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వ రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తిరుమలేశునికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీవారికి కానుకగా భారీ కాసుల హారం
విజయవాడకు చెందిన రామలింగరాజు అనే భక్తుడు శనివారం ఐదు పేటల బంగారు సహస్రనామ కాసుల హారాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు. 28.645 కేజీల బరువున్న ఈ ఆభరణం విలువ రూ.8.39 కోట్లు ఉంటుంది. ఈ హారంలో 1,008 కాసులు ఉన్నాయి. ఒక్కో కాసుపై సహస్ర నామావళిని ముద్రించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన అధికారులకు అందజేశారు.