నెట్‌లో ఎస్‌ఎస్ ప్రశ్నపత్రాలు!
Published Sun, Mar 26 2017 4:58 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
► పరీక్షకు ముందే
► యూ ట్యూబ్‌లో ప్రత్యక్షం
► యాన్యువల్ పరీక్షల్లా
► జరుపుతున్నామని చెప్పినా ప్రశ్న పత్రాలు లీక్
► ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఇవ్వడంతో వెలుగులోకి..
► విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వల్లే పేపర్ లీక్ అంటున్న యాజమాన్యాలు
ప్రకాశం: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమికోన్నత విద్యను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సమగ్ర మూల్యాంకనం (సమ్మెటివ్ అస్సెస్‌మెంట్) కోసం తయారు చేసిన ప్రశ్నపత్రాలు ముందే లీక్ అయ్యాయి. రెండు రోజుల తరువాత జరగాల్సిన సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్న పత్రాలు ముందుగానే యూట్యూబ్‌లో పెట్టేశారు. వీటిని గమనించిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రేపటి ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో ఎప్పుడు పెడతారంటూ చాటింగ్ చేసిన తీరు చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది అవసరం ఉండవు. చిన్న వయస్సులో వారికి పోటీ పడేలా పరీక్షలు నిర్వహించి భారం పెట్టకూడదని పదో తరగతినే ప్రామాణికం చేశారు. కానీ కొందరు ఉపాధ్యాయులు దీన్ని అలుసుగా తీసుకుని విద్యార్థులకు చదువు చెప్పడం మానేశారు. వారి వారి వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సమగ్ర మూల్యాంకనం (సమ్మెటివ్ అస్సెస్‌మెంట్) పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం సమ్మెటివ్ అస్సెస్‌మెంట్–3 (ఎస్‌ఏ–3) నడుస్తోంది. ఒక పాఠశాల జవాబు పత్రాలను మరో పాఠశాల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంది. తద్వారా విద్యార్థి ప్రతిభ బయటపడుతుంది. 8,9 తరగతుల విద్యార్థుల జవాబు పత్రాలను పూర్తిగా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు, 6,7 తరగతుల వారివి కనీసం 15 శాతం మందివి ఇతర ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంది. బోర్డుపై జవాబులు రాసి విద్యార్థులచే పరీక్షలు రాయిస్తున్న పాఠశాలలు ఈ విధానం వలన దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. దీంతో విద్యాశాఖాధికారులతో కుమ్మక్కై ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రతతో ప్రశ్నపత్రాల సరఫరా..
సమగ్ర మూల్యాంకనం పరీక్షల నిర్వహణకు తయారు చేస్తున్న ప్రశ్నపత్రాలను ఆయా మండలాల ఎమ్మార్సీలకు చేరుస్తారు. అక్కడ ఒక పెట్టెలో భద్రపరిచి పాఠశాల యాజమాన్యం, ఎంఈవో వద్ద రెండు తాళాలు పెట్టుకుంటారు. ఇలా ఏరోజు ప్రశ్న పత్రాలను అదే రోజు అరగంట ముందు ఎమ్మార్సీకి వెళ్లి ప్రశ్నపత్రాలను తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2గంటల నుంచి జరగాల్సిన పరీక్షకు ప్రశ్నపత్రాలను 1.30 గంటలకు ఆయా పాఠశాలల యాజమాన్యానికి అందజేస్తారు. కానీ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి ప్రశ్నపత్రాలను ముందుగానే పాఠశాలలకు చేరుస్తున్నారు. పాఠశాలల యాజమాన్యం ప్రశ్నపత్రాలను వారి విద్యార్థులకు పంపిణీ చేసి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు మాత్రమే చదువుకుని పరీక్ష రాయాలని ఇస్తున్నారు. దీని వలన ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోందని పలు పాఠశాలల యజమానులు ఆరోపిస్తున్నారు. శనివారం జరిగిన సోషల్–1 ప్రశ్నపత్రాన్ని రెండు రోజుల ముందే యూట్యూబ్‌లో పెట్టారు. సోమవారం జరగాల్సిన సోషల్–2
పేపర్ కూడా ముందే యూట్యూబ్‌లో ఉంచారు.
గిద్దలూరులో ఓ పాఠశాల విద్యార్థులకు ముందే చేరుతున్న ప్రశ్నపత్రాలు:
గిద్దలూరులో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఎస్‌ఏ –3 ప్రశ్న పత్రాలను రెండు రోజుల ముందే వారి విద్యార్థులకు ఇచ్చి జవాబులు నేర్చుకోవాలని చెప్పారు. ఆ విద్యార్థులు తాము చదువుకోవడంతో పాటు మరో పాఠశాల విద్యార్థులకు కూడా ప్రశ్నపత్రాలను ఇచ్చారు. ఇలా విద్యార్థులు వారి ప్రధానోపాధ్యాయునికి ప్రశ్నపత్రాలను చూపించి పలానా స్కూల్ విద్యార్థులు ఇచ్చారని, వారికి రోజూ ప్రశ్నపత్రాలు అందుతున్నాయని చెప్పారు. దీంతో అవాక్కయిన హెచ్‌ఎం విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. సదరు పాఠశాల కరస్పాండెంట్ అధికారికి అనుచరుడుగా ఉండటంతో పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
జూనియర్ కళాశాలను నడుపుతున్న సదరు పాఠశాల యజమాని, ఇటీవలే స్కూల్ ప్రారంభించి అతని పాఠశాల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని చూపించుకునేందుకు ఇలా ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నాడని మిగిలిన పాఠశాలల యాజమానాలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.7 వేలు అదనంగా వసూలు చేస్తున్న సదరు పాఠశాల నిర్వాహకుడు విద్యార్థులకు చదువు చెప్పలేకున్నా ప్రశ్నపత్రాల లీక్‌తో ఉన్నత మార్కులు వచ్చేలా చేసుకుని ప్రచారం చేసి విద్యార్థులను చేర్పించుకునే యత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో ఉండటంతో కొందరు విద్యార్థులు సైతం వాటిని చూసి అవసరమైన వరకే చదువుకుని మిగిలిన పాఠ్యాంశాలను వదిలేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రశ్నపత్రాలు అరగంట ముందు ఇస్తున్నాం
ఎస్‌ఏ–3 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల బండిళ్లను పరీక్షకు అరగంట ముందు మాత్రమే ఇస్తున్నాం. ప్రతి పాఠశాలకు ఒక పరిశీలకుడిని నియమించి మా వద్ద ఉన్న సీల్డ్ ప్రశ్నపత్రాలను ఆయనకే అందిస్తున్నాం. పరీక్ష మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాం. పేపర్ లీకయ్యే అవకాశం లేదు. పాఠశాలల యాజమాన్యాలు యూ ట్యూబ్‌లో ఉన్న ప్రశ్న పత్రాలను చూసి వారి పిల్లలకు ఇచ్చుకుంటున్నారేమో తెలియదు. -ముత్యాల సుబ్బారావు, ఎంఈఓ, గిద్దలూరు.
Advertisement