
సాక్షి, అమరావతి: కోవిడ్ 19 నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా వివిధ పద్దులు కింద అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి టీఆర్ 27, గ్రీన్ ఛానెల్ పీడీ ఖాతాలు, జిల్లా మినరల్ ఫండ్ కింద మొత్తం రూ.373.76 కోట్లు అందుబాటులో ఉంచినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిధులను.. క్వారంటైన్‌లో ఉన్నవారికి తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణకు,స్క్రీనింగ్, కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించడానికి, కోవిడ్ 19 నియంత్రణ, చికిత్సలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు, కోవిడ్ నియంత్రణలో భాగంగా సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పురపాలక, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి సంక్షేమానికి చర్యలు
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందినవారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కోవిడ్–19 నియంత్రణ చర్యల రాష్ట్ర స్థాయి సమన్వయాధికారి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. లాక్‌డౌన్ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై త్వరలో ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌పై ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నదానిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నేతృత్వంలో టాస్క్‌ఫోర్సు కమిటీ పనిచేస్తోందన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబులతో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53 వేల మంది కూలీలకు రాష్ట్ర వ్యాప్తంగా 326 షెల్టర్లు ఏర్పాటు చేసి ఆహార వసతి కల్పించాం.
► పరిశ్రమల్లో పనిచేస్తున్న మరో 50 వేల మంది కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు మరో 208 షెల్టర్లు ఏర్పాటు చేశాయి.
► పది రాష్ట్రాల్లో చిక్కుకున్న 8 వేల మంది ఏపీకి చెందిన వారి క్షేమం కోసం చర్యలు.
Comments
Please login to add a commentAdd a comment