- ప్రేమ వ్యవహారం కారణం
పాడేరురూరల్: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన స్టాఫ్‌నర్సు సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ముంచంగిపుట్టుకు చెందిన గంపరాయి రుక్మిణి (25) హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్‌సీలో పని చేస్తున్నది. ఈమె పాడేరులోని లోచెలిపుట్టు ప్రాంతంలో నివాసం ఉంటోంది. పక్క ఇంటిలో ఉంటున్న సెగ్గె శ్రీను సోదరుడు అదే పీహెచ్‌సీలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో తరచూ ఉప్పపీహెచ్‌సీకి శ్రీను వెళ్లేవాడు. అక్కడ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఇది ప్రేమగా మారింది. శ్రీనుది కొయ్యూరు మండలం వైఎన్‌పాకలు. డిగ్రీవరకు చదువుకున్న ఇతడు పాడేరులోని సోదరుని ఇంటిలోనే ఉంటున్నాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాల వారు ఈ నెల 11న పెళ్లి నిశ్చయానికి మాట్లాడుకోవాలనుకున్నారు. కాగా సోమవారం ఉదయాన్నే తాను స్వగ్రామానికి వెళుతున్నట్టు రుక్మిణి శ్రీనుకు ఎస్‌ఎంఎస్ పెట్టింది. ప్రియుడి నుంచి సమాధానం రాలేదు. తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడేమోనని ఆమె మనస్తాపానికి గురైంది. సాయంత్రం క్లోరోక్విన్ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకొంది.
శ్రీను ఆమెను ఆటోలో స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. కొద్ది సేపటికే ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు శెట్టి నాగరాజు, పీహెచ్ భాగ్యవతి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి ఆస్పత్రికి చేరుకొని మృతురాలి బంధువులను ఓదార్చారు.
స్టాఫ్ నర్సు మృతికి కారణమైన సెగ్గె శ్రీనును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మృతురాలి బంధువులు తెలిపారు.