జగన్ దీక్షకు సర్వం సిద్ధం | stage set for ys jagan mohan reddy raithu deeksha in tanuku | Sakshi
Sakshi News home page

జగన్ దీక్షకు సర్వం సిద్ధం

Published Sat, Jan 31 2015 12:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

stage set for ys jagan mohan reddy raithu deeksha in tanuku

* ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిరాహార దీక్ష
* తణుకులో నేడు, రేపు కొనసాగనున్న దీక్ష.. పూర్తయిన ఏర్పాట్లు
* చంద్రబాబు మోసపూరిత చర్యలను ప్రజల పక్షాన ప్రశ్నించనున్న ప్రతిపక్ష నేత
* జననేత కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు, ప్రజలు
* జనసంద్రమైన తణుకు పట్టణం.. శుక్రవారం నుంచే తరలి వస్తున్న జనసందోహం

సాక్షి ప్రతినిధి, ఏలూరు, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎప్పటికప్పుడు ప్రజలను మోసపుచ్చుతూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షను చేపట్టనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జగన్ దీక్ష కొనసాగిస్తారు.

చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మిహ ళలు, ప్రజలకు అండగా నిలబడాలన్న లక్ష్యంతో ప్రతిపక్ష నేత ఈ దీక్షకు దిగుతున్నారు. ఈ సందర్భంగా గత ఎనిమిది నెలల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టనున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ అంశాల్లో ప్రభుత్వ కప్పదాటు వైఖరితో ఇతరత్రా సర్కారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై వైఎస్సార్‌సీపీ గత నవంబర్‌లో మూడు దశల ఆందోళనలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే.

మొదటి దశలో భాగంగా నవంబర్ మొదటివారంలో పార్టీ శ్రేణులు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించగా.. రెండవ దశలో డిసెంబర్ మొదటివారంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేశారు. మూడవ దశలో అధినేత జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా శనివారం రెండు రోజుల దీక్షకు దిగుతున్నారు. దీక్షలో పాల్గొనేందుకుగాను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి విమానమార్గంలో రాజమండ్రికి చేరుకుని.. రోడ్డుమార్గాన తణుకు చేరుకుంటారు.

అభిమానులతో నిండిపోయిన తణుకు
స్వాతంత్య్రోద్యమం నుంచి ఎన్నో ప్రజా ఉద్యమాలకు కేంద్రమైన తణుకు నుంచే ప్రజానేత టీడీపీ ప్రభుత్వంపై ఎడతెగని పోరాటాలకు శ్రీకారం చుట్టనున్నారు. తణుకులో జాతీయ రహదారి పక్కన బెల్లం మార్కెట్ సమీపంలో శని, ఆదివారాల్లో చేపట్టనున్న ఈ దీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రుణమాఫీ కొర్రీలతో రైతులను, మహిళలను, నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను, మరోవైపు రూ.వెయ్యి పెన్షన్ ఇస్తామని చెప్పి.. సగానికి సగం మంది లబ్ధిదారులను తగ్గించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను దారుణంగా వంచించిన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్ చేపడుతున్న దీక్షకు ప్రజలనుంచి భారీ మద్దతు లభిస్తోంది.

శుక్రవారం నుంచే భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నమ్మి నిండా మునిగిన రైతన్నలు జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి తణుకు పట్టణానికి చేరుకున్నారు. ఎటుచూసినా జగన్ దీక్షకు స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులే కనిపిస్తున్న పరిస్థితి. రైతులతోపాటు మరోవైపు యువకులు కూడా భారీఎత్తున తణుకు చేరుకున్నారు. దీంతో కనీవినీ ఎరుగనిరీతిలో తణుకు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని లాడ్జీలు, కల్యాణ మండపాలు, ఆడిటోరియాలు, హాళ్లు నిండిపోవడంతో ఇతరప్రాంతాల నుంచి వచ్చినవారు సభావేదికవద్దే సేదతీరుతున్నారు.

రాజధాని ప్రాంతం నుంచీ..
రైతు దీక్షకు రాజధాని ప్రాంత రైతులూ పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేందుకు సిద్ధంగా లేని రైతులు ఇప్పటికే అక్కడి వైఎస్సార్‌సీపీ నేతల అండతో ఆందోళన చేస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేపట్టిన దీక్షకు భారీఎత్తున తరలివెళ్లడం ద్వారా పాలకులకు తమ నిరసనల తీవ్రతను తెలపాలన్నది అక్కడి రైతుల ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతేగాక ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తమకు అండగా ఉన్నారన్న సంకేతాన్ని పంపాలన్నది ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, రాయపూడి, వెంకటాపురం, ఉద్దండరాయపాలెం తదితర గ్రామాల రైతుల ఆలోచన.

దీక్షతో పాలకుల్లో వణుకు పుడుతోంది: ఆళ్ల నాని
తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం 10.30 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేపట్టనున్నారని వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్ ఆళ్ల నాని శుక్రవారం తెలిపారు. దీక్షావేదికపైనుంచి జగన్ ఏం మాట్లాడతారోనంటూ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, పాలకుల్లో వణుకుపుడుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement