రాహుల్ను ప్రధాని చేసేందుకే సీమాంధ్రులకు అన్యాయం: షర్మిల
తెలంగాణ, సీమాంధ్రుల మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ చలికాచుకుంటోందని, రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కోట్ల మంది సీమాంధ్రులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన సమైక్య శంఖారావం బస్సు యాత్రలో ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా చంద్రబాబులో చలనం లేదని, బ్లాంక్ చెక్ ఇచ్చి రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైంది చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు.
హత్య చేసి.. ఆ శవం మీద ఎక్కిఎక్కి ఏడ్చినట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. టీడీపీ సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్నాయని, వైఎస్‌ఆర్ సీపీ సహా మూడు పార్టీలు విభజనకు ఎప్పుడూ అనుకూలంగా లేవని తెలిపారు. చంద్రబాబు ఇప్పుడైనా కళ్లు తెరిచి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఆయన కూడా రాజీనామా చేయాలని, చంద్రబాబు, టీడీపీ నేతలు రాజీనామాలు చేసేంతవరకు సీమాంధ్రలో వారెవరినీ అడుగు పెట్టనీయకూడదని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని, వైఎస్ఆర్ ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రధానే అన్నారని షర్మిల గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్ని జగనన్నను జైలులో పెట్టించాయని, బోనులో ఉన్నా సింహం సింహమే, త్వరలోనే జగనన్న బయటకు వస్తారని చెప్పారు.