
యూటీ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే: దానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ తోసిపుచ్చారు. సీమాంధ్ర నేతల వాదనకు తలొగ్గి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. గాంధీభవన్ ఆవరణలో మంగళవారం దానం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో భాగమేనని, ఈ విషయంలో సీడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గతంలో విజ్ఞప్తి చేస్తే కొత్త వాదనలను తీసుకురావొద్దని సోనియాగాంధీసహా హైకమాండ్ పెద్దలు చెప్పారని అన్నారు. అందుకే ఆ అంశం జోలికి తాము వెళ్లడం లేదన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ర్ట చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క బీసీ నేత కూడా ముఖ్యమంత్రి కాలేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని కూడా తొంగలో తొక్కారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీ నాయకుడినే ముఖ్యమంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు. అందుకోసం తాను తెలంగాణ అంతటా విస్త్రతంగా పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని తెలిపారు.