సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల భవితను కిరణ్ సర్కారు ప్రశ్నార్థకం చేస్తోంది. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులకు తన వాటా ధనాన్ని సర్కారు కేటాయించడం లేదు. ఇదే అలుసుగా తీసుకున్న రైల్వే శాఖ ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు.
అందుకు తార్కా ణం రాయదుర్గం- తుమకూరు రైలు మార్గమే. 2012-13, 2013-14 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించక పోవడంతో రైల్వే శాఖ కూడా నిధులు కేటాయించలేదు. 2014-15 బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కేటాయించే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చిక్‌బళ్లాపుర-పుట్టపర్తి, పుట్టపర్తి-కదిరి రైల్వే మార్గాలదీ అదే పరిస్థితి.
రాయదుర్గం-తుమకూరు, కదిరి-పుట్టపర్తి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపుర రైల్వే మార్గాలను నిర్మించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. చేపట్టడానికి సిద్ధమైనని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు వైఎస్ ఏకీభవించడంతో 2008-09 బడ్జెట్లో ఆ మూడు మార్గాలను రైల్వే శాఖ మంజూరు చేసింది. వైఎస్ మరణంతో ఆ మూడు ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది.
రాయదుర్గం-తమకూరు రైలు మార్గానికి 2010-11 బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేదు. 2011-12 బడ్జెట్లో తన వాటా నిధులుగా రూ.40 కోట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైల్వే శాఖ అదే ఏడాది బడ్జెట్లో తన వాటాగా రూ.40 కోట్లు మంజూరు చేసింది. కానీ.. 2011-12లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయలేదు. దాంతో.. రైల్వే శాఖ 2012-13 బడ్జెట్లో ఈ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. 2011-12 బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా వెనక్కి తీసుకుని, రైలుమార్గాన్ని రద్దు చేస్తామని అల్టిమేటం జారీ చేయడంతో 2012 నవంబర్ 16న తన వాటా నిధులు రూ.40 కోట్లను విడుదల చేసింది.
దాంతో.. తొలి విడతగా రూ.50 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఇటీవల రూ.30 కోట్ల వ్యయంతో రెండో దశ టెండర్లను పిలిచారు. కానీ.. 2013-14 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయకపోవడంతో రైల్వే శాఖ కూడా నిధులను కేటాయించలేదు. 2014-15 బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.100 కోట్లను మాత్రమే కిరణ్ సర్కారు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాయదుర్గం-తుమకూరు రైలు మార్గానికి ఒకవేళ దక్కినా రూ.5 నుంచి రూ.పది కోట్లకు మించవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదే అభిప్రాయంతో ఉన్న రైల్వే శాఖ 2014-15 బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించే అవకాశాలు లేవని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాయదుర్గం- తుమకూరు రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సమయంలో ఆ మార్గాన్ని 2014 నాటికి పూర్తి చేస్తామని సీఎం కిరణ్ హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మరో రెండు దశాబ్దాల నాటికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉండదు. పుట్టపర్తి-కదిరి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపుర రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వే బోర్డు సర్వే చేయించింది. అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో అంచనాల్లోనే ఆ ప్రాజెక్టులను రైల్వే శాఖ పక్కన పెట్టేసింది.
రైల్వే లైన్లపై రాష్ట్రం చిన్నచూపు
Published Wed, Feb 12 2014 2:00 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement