
వడగాలులు..చిరుజల్లులు
ఎండలకు పెద్దలే తల్లడిల్లిపోతుంటే.. పసివాళ్లేం భరించగలరు. అందుకే గొంతెండిపోతుంటే ఓ బాలుడు వీధి కొళాయి నీటి ధారల్ని ఆత్రంగా తాగాడు. రావికమతం సినీమాహాలు సమీపంలో సోమవారం కనిపించిందీ దృశ్యం.
- ఈదురుగాలులతో వింత వాతావరణం
- ఓ మహిళ దుర్మరణం
సాక్షి, విశాఖపట్నం : తీవ్ర వడగాడ్పులతో జిల్లా, నగరం అట్టుడుకిపోతోంది. వడదెబ్బకు మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం మరో 31 మందిని పొట్టనబెట్టుకుంది. వీరిలో జిల్లాలో 20 మంది, నగర పరిధిలో 11 మంది ఉన్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. నగరం (విమానాశ్రయం)లో సోమవారం 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ఆదివారం (45 డిగ్రీలు)తో పోల్చుకుంటే ఇది దాదాపు 4 డిగ్రీలు తక్కువ. అయినా ఉష్ణతీవ్రత అటు నగరంలోను, ఇటు జిల్లాలోనూ బాగానే కనిపించింది. ఉదయం నుంచి ఉడుకును వెదజల్లుతూనే ఉంది. అయితే ఆరు రోజుల నుంచి అదే పనిగా వణికిస్తున్న వడగాడ్పులతో అల్లాడుతున్న జనానికి సోమవారం సాయంత్రం ఒకింత సాంత్వన చేకూర్చింది. సాయంత్రం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో పాటు తేలికపాటి జల్లులు కురిసి వాతావరణాన్ని చల్లబరిచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ గాలులకు దుమ్ము, ధూళి ఎగసి పడింది. నగరంలోని మురళీనగర్, శివారు ప్రాంతాలు, పెందుర్తి, అడవివరం, గాజువాక, దబ్బందతో పాటు చోడవరం, చీడికాడ, కె.కోటపాడు ప్రాంతాల్లో కొన్నిచోట్ల జల్లులు, మరికొన్ని చోట్ల వర్షం కురిసింది.
తొలుత భారీ ఈదురుగాలులు హడావుడి చేశాయి. తర్వాత జల్లులు కురిసి వేడి తీవ్రతను కాస్త తగ్గించడంతో జనం ఊరట చెందారు. జిల్లాలోని ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు శివారు నీలాద్రిపురంలో ఈదురుగాలులకు చెట్టుపడి నూకరత్నం అనే మహిళ దుర్మరణం పాలయింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి పగలు వేడిగాలులు కొనసాగుతూ సాయంత్రం వేళ ఇలాంటి వాతావరణమే కొన్నాళ్లు ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.