
ఐఎన్‌ఎస్ అనిర్వేష్ జలప్రవేశం
తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో మరో అత్యాధునిక నిఘా నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో
తీరప్రాంత భద్రత మరింత పటిష్టం: వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో మరో అత్యాధునిక నిఘా నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐఎన్‌ఎస్ అనిర్వేష్’ను తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ సోమవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. 50 మీటర్ల పొడవు, 317 టన్నుల బరువున్న ఈ వెసల్‌ను కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు. సముద్ర జలాలపై నిఘా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో రాత్రి పూట కూడా పకడ్బందీగా గస్తీ విధులు నిర్వర్తించేందుకు అత్యాధునిక నైట్‌విజన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నౌక ముందు భాగంలో 40/60 బోఫోర్స్ గన్‌ను అమర్చారు.
ఈ నౌకలో ఆరుగురు అధికారులతోపాటు 34 మంది నౌకాదళ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ మాట్లాడుతూ ఐఎన్‌ఎస్ అనిర్వేష్ ప్రవేశంతో తూర్పునౌకాదళం మరింత బలోపేతమైందని చెప్పారు. అత్యాధునిక రక్షణ వ్యవస్థతో రూపొందించిన ఈ వెసల్‌తో తీరప్రాంత భద్రత మరింత కట్టుదిట్టమవుతుందన్నారు. కమోర్తా శ్రేణికి చెందిన నౌక వచ్చే ఏడాది తూర్పు నౌకాదళంలోకి చేరుతుందని ఆయన తెలిపారు. కోస్ట్‌గార్డ్ ఐజీ ఎస్పీ శర్మ మాట్లాడుతూ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో త్వరలో కోస్ట్‌గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్ ప్రారంభిస్తామని చెప్పారు. నిజాంపట్నం కోస్ట్‌గార్డ్ స్టేషన్‌ను త్వరలో మచిలీపట్నానికి మారుస్తామని వెల్లడించారు. నిజాం పట్నం వద్ద తగినంత లోతు లేకపోవడం, పోర్టు కూడా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.