పశ్చిమగోదావరి జిల్లా గోష్పాద క్షేత్రం వద్ద గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. గోదావరి నదిలో ఆదివారం సాయంత్రం స్నానానికి దిగిన నందిగం జయదేవ్(15), గాలింకి సూర్య సుమంత్(15) గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి పోద్దుపోయే వరకు అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు నదిలో ముమ్మరంగా గాలించినప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని ప్రత్యేక ఈతగాడు సోమవారం నదిలో గాలించగా, మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులిద్దరూ కొవ్వూరులోని వేగివారి చావడి ప్రాంతానికి చెందిన వారు. స్ధానిక శ్రీచైతన్య స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.