స్టూడెంట్ పాస్ ఉన్నా తప్పని చార్జీ
Published Tue, Oct 22 2013 2:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ :సెలవు దినాల్లో విద్యార్థుల బస్సు పాస్‌లను కండక్టర్లు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా చార్జీలు చెల్లించాల్సి రావడంతో తల్లిదండ్రులపై ఆర్థికభారం పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం, సకల జనుల సమ్మె కారణంగా విద్యార్థులు కోల్పోయిన విలువైన కాలాన్ని భర్తీ చేసేందుకు శని, ఆదివారాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వివిధ మండల కేంద్రాలు, పట్టణాల్లోని పాఠశాలలకు చేరుకునే గ్రామీణ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులే ప్రధాన రవాణా సాధనం. విద్యార్థులు నెలకోమారు నగదు చెల్లిస్తూ బస్సు పాస్ పొందుతారు. ఈ పాస్‌తో ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి రోజుకు రెండుసార్లు రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం శని, ఆదివారాలతో పాటు మిగిలిన సెలవు దినాల్లో పాఠశాలలకు హాజరు కావాల్సి ఉండటంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు.
సెలవు దినాల్లో టికెట్ కొనాల్సిందేనని, చార్జీ ఇవ్వాల్సిందేనని కొందరు కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో సెలవు దినాల్లో తరగతులకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. తరగతులకు హాజరుకాకపోతే విలువైన పాఠ్యాంశాల బోధనను కోల్పోవాల్సి ఉంటుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సెలవు దినాల్లో టికెట్‌కు డబ్బు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారని కొందరు విద్యార్థులు వాపోయారు. ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
టికెట్ అడగొద్దని ఆదేశాలిచ్చాం
పాస్ కలిగిన విద్యార్థులను సెలవుదినాల్లో సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి అనుమతించాలని సంబంధిత డిపో మేనేజర్లను ఆదేశించాం. టికెట్ అడగవద్దని స్పష్టంగా చెప్పాం. ఇంకా సిబ్బందికి ఎవరికైనా తెలియకుంటే నోటీసు బోర్డు ద్వారా సమాచారాన్ని చేరవేస్తాం. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా, నిర్భయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎవరైనా అభ్యంతరం తెలిపితే నేరుగా నన్ను (9959225635) సంప్రదించవచ్చు.
- చింతా రవికుమార్, ఆర్టీసీ ఆర్‌ఎం
Advertisement
Advertisement