బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి
విజయవాడ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో కళాశాల విద్యార్థిని మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట సమీపంలోని పెంటెలవారిగూడెం ప్రాంతానికి చెందిన రావూరి జ్యోత్స్న (21) నగరంలోని లయోలా కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ప్రతిరోజు కళాశాలకు రాకపోకలు సాగిస్తోంది. గురువారం ఉదయం జ్యోత్స్న ఏపీ11జెడ్ 6411 నంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కి కాలేజీ గేటు వద్ద దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు ముందు టైరు కింద పడి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు.
మృత్యువుతో పోరాటం
బస్సుకింద పడిన జ్యోత్స్న శరీరంలో సగభాగం పూర్తిగా చిధ్రమైంది. రోజంతా మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం మృతి చెందింది. దీంతో విద్యార్థులు, స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యం చేస్తున్నంత సేపట్లో దాదాపు 32 బ్లడ్ బాటిల్స్ తెప్పించిన వైద్యులు జ్యోత్స్నను బతికించడంలో విఫలమయ్యారని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయం చేయాలని ఆందోళన
పేద కుటుంబానికి చెందిన జ్యోత్స్న తండ్రి రామారావు వ్యవసాయం చేస్తారని బంధువులు తెలిపారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విద్యార్థులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆర్టీసీ అధికారులు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ పొన్నపల్లి సతీష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.