బదిలీల పితలాటకం
- సబ్ రిజిస్ట్రార్ల టెన్షన్ టెన్షన్
- జోరందుకున్న పైరవీలు
- ముమ్మరంగా బేరసారాలు
విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లలో బదిలీల టెన్షన్ ప్రారంభమయింది. కాసులు కురిపించే పోస్టింగ్‌లపై కొందరు కన్నేసి పావులు కదుపుతుండగా మరికొందరు జోరుగా రాజకీయ పైరవీలకు దిగుతున్నారు. ఓ వైపు అధికార పక్ష నేతలు, మరోవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఉన్నతాధికారులకు డబ్బు ముట్టజెప్పేందుకు కొందరు సబ్ రిజిస్ట్రార్లు బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం.
గెజిటెడ్ అధికారుల బదిలీల్లో జీరో సర్వీసు నిబంధనను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. గెజిటెడ్ అధికారి హోదా ఉన్న సబ్ రిజిస్ట్రార్లను సర్వీసుతో నిమిత్తం లేకుండా జోన్ పరిధిలో బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 223 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఇవికాక నాన్ ఫోక ల్‌లో మరో 40 సబ్ రిజిస్ట్రార్ పోస్టులున్నాయి. గతంలో ఒక చోట పోస్టింగ్ పొందిన అధికారిని రెండేళ్ల వరకు బదిలీల కౌన్సెలింగ్‌కు పిలిచేవారు కారు. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జీవో ప్రకారం జీరో సర్వీసులో ఉన్నవారినీ బదిలీ చేయొచ్చు.
53 మందికి గండం....
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని నాలుగు జోన్లలో దాదాపు 40 మంది సబ్ రిజిస్ట్రార్లు పోస్టింగ్ ఉత్తర్వులు పొందారు. మరో 13 మంది డీఆర్ పోస్టింగ్‌లు పొందారు. వారంతా ఏడాదిలోపు సర్వీసు పూర్తిచేశారు. లక్షలు గుమ్మరించి పొందిన పోస్టింగ్‌ను అతి తక్కువ కాలంలో వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వారు వ్యథ చెందుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 53 మంది సబ్ రిజిస్ట్రార్లు అసోసియేషన్ ఆఫీసు బేరర్లుగా పనిచేయడంతో వారు పని చేసే స్థానాలకు ఢోకా లేకుండా నిబంధనలు జారీ అయ్యాయి.
పోకల్ పోస్టింగ్‌లకు పెరిగిన పోటీ...
సబ్ రిజిస్ట్రార్లు పోకల్ (పైరాబడి) పోస్టింగ్‌లపై గురిపెట్టారు. కృష్ణా, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు సమీపంలో ఉన్న కార్యాలయాలకు డిమాండ్ అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు ప్రాంతాల్లో దాదాపు 37 సబ్ రిజిస్ట్రార్ పోస్టింగ్‌లకు డిమాండ్ అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు సబ్ రిజిస్ట్రార్లు అధికార పార్టీ నేతల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారు.
ఆ శాఖ ఉన్నతాధికారులతో కూడా పోస్టింగ్‌లపై మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం తమను సంప్రదించాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారులు పోస్టింగ్‌ల కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇప్పటికే ట్రాన్స్‌ఫర్ అథారిటీ అధికారులు కొందరు సబ్ రిజిస్ట్రార్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వినికిడి. అధికార పార్టీ నేతలు అడ్డం తిరగడంతో కొందరు సబ్ రిజిస్ట్రార్లు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఉన్నతాధికారులు బదిలీలపై సర్క్యులర్ జారీ చేయనున్నట్లు సమాచారం.