
బాధితులు కులాయ్‌రెడ్డి, లక్ష్మీతులసిలతో మాట్లాడుతున్న సుధీర్‌రెడ్డి
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్: పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గసమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై దాడి చేయడం దారుణం అన్నారు. ఏమైనా ఉంటే తమపైన ప్రతాపం చూపించాలే తప్ప పేద ప్రజలపై కాదన్నారు. మంత్రి ఆది చర్చకు వచ్చినా ఇంకేదానికి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎక్కడో కూర్చొని తమ కుటుంబ సభ్యులు, కుమారుడి చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
నీవే రంగంలోకి దిగితే తాము కూడా దిగుతామని ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది. కానీ పోలీసులు ఎంపీ వైఎస్ ఆవినాష్‌రెడ్డిని, తనను పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించకుండా అడ్డుకోవడం మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నట్లు ఉందన్నారు. ఆది మంత్రి పదవికి అనర్హుడు. క్లబ్బులు, పేకాటలకు పరిమితమైన ఆయనను మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తొలగించాలన్నారు. ఆదివారం జరిగిన సంఘటన ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్‌డేగా మిగిలిపోతుందన్నారు. తమ వారికి ఏమైనా జరిగితే మంత్రి కుటుంబ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. గ్రామంలో మంత్రి ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణ దగ్గరుండి దాడులు చేయించడం ఆమెకు తగదన్నారు.కుమారుడు ఇప్పటికే చెడుదారిలో పయనిస్తున్నాడని, అతన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తల్లిపై ఉందని సూచించారు. మహిళలంటే తమకు గౌరవం అన్నారు.అరుణమ్మ మంచి తల్లిగా గుర్తింపు తెచ్చుకోవాలే తప్ప ఇలా గూండాయిజం చేయించడం మంచిది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment