రాజధానికి నూజివీడే అనుకూలం
- పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల సేకరణకు అవకాశం
- ప్రకృతి విపత్తుల భయం లేని ప్రాంతం
- విమానాశ్రయం ఏర్పాటుకూ భూములు
- తొందరపాటు నిర్ణయాలొద్దు
- ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సూచన
నూజివీడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి అన్ని హంగులూ కలిగిన అనువైన ప్రదేశం నూజివీడేనని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడును రాజధానిగా నిర్మిస్తే ఏలూరు, నూజివీడు, విజయవాడ కలసి దేశంలోనే ఒక పెద్ద మహానగరంగా మారుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ పరిసరాలలోనే రాజధాని ఉంటుందని ప్రకటించడం శుభపరిణామమని, అయితే రోజుకోవిధంగా ప్రకటన ఇస్తుండటంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని చెప్పారు. దీనికి తెరదించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు తదితరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టంచేయాలన్నారు. నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే ఒక్క పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల భూములు సేకరించవచ్చన్నారు. ఈ ప్రాంత భూములు భారీ భవనాల నిర్మాణానికి అనువైనవని, భూకంపాలు కూడా వచ్చే ప్రమాదం లేదని నిపుణులు తెలిపారని వివరించారు.
నూజివీడుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే విమానాశ్రయం ఉందని, నూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకుంటే కాట్రేనిపాడులో దాదాపు ఐదువేల ఎకరాల అటవీభూములు ఉన్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఎలాంటి నష్టం గాని, ముంపు భయం గాని లేని ప్రాంతం నూజివీడు ఒక్కటేనని తెలిపారు. నూజివీడు ప్రాంతం హైదరాబాద్ తరహా భౌగోళిక నైసర్గికత కలిగి ఉందని చెప్పారు. పాలకులు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందన్నారు.
నూజివీడు ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని 1953లోనే ఆనాటి పెద్దలు నిర్ణయించారని, కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయకుండా కర్నూలులో ఏర్పాటు చేశారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నూజివీడు మండల అధ్యక్షుడు మందాడ నాగేశ్వరరావు, నాయకుడు పల్లె రవీంద్రరెడ్డి పాల్గొన్నారు.