
భావన్నారాయణుని అభిషేకిస్తున్న సూర్యకిరణాలు
ప్రకాశం, చినగంజాం: పెదగంజాం గ్రామంలో భూనీలా సమేత భావన్నారాయణ స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను అభిషేకిస్తున్నాయి. బుధవారం నాలుగో రోజు కూడా సూర్యకిరణాలు స్వామి వారిని ఆపాదమస్తకం అభిషేకించి భక్తులను పులకింపజేశాయి. సుమారు 10 నుంచి 15 నిమిషాలపాటు సంభవించే ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేకువ జామునే ఆలయానికి తరలివచ్చారు. ఏటా ఉత్తరాయణం, దక్షిణాయణ పుణ్యకాలంలో సూర్య కిరణాలు స్వామివారిని స్పృశిస్తాయి. మార్చి మొదటి వారంలో, సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి వారంలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.