జగన్ నాయకత్వానికే మద్దతు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వానికే కళింగవైశ్యుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అందవరపు వరహానరసింహం(వరం) అన్నారు. శ్రీకాకుళంలోని వరం రెసిడెన్సీలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళింగ వైశ్యులు ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు. ఈ కులాన్ని బీసీ కులాల జాబితాలో చేర్చేందుకు జగన్‌మోహనరెడ్డి పూర్తి హామీ ఇచ్చారన్నారు.
అందుకు కృతజ్ఞతగా రాష్ట్రంతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఉన్న లక్షలాది మంది కళింగ వైశ్యులు(కళింగ కోమట్లు) రానున్న ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని బలపరుస్తారని వెల్లడించారు. రాజశేఖర రెడ్డి అకాల మరణం వల్ల బీసీల్లో చేర్చాల్సిన కళింగ వైశ్యుల చట్టం నిలిచిపోయిందన్నారు. తరువాత వచ్చే పాలకుల నిర్లక్ష్యంతో ఇంతవరకూ బీసీ జాబితాలో చేర్చలేదని ఆరోపించారు. దీనిపై జగన్‌మోహనరెడ్డి గత నరసన్నపేట ఉప ఎన్నికల్లోనూ, ఇటీవల జిల్లా పర్యటనలోనూ హామీ ఇచ్చారన్నారు. వైఎస్ కుటుంబం ఇచ్చినమాట నిలబెట్టుకుంటుందని, ఆ నమ్మకంతోనే జగన్ నాయకత్వాన్ని రానున్న ఎన్నికల్లో సమర్ధిస్తున్నామన్నారు.