విభజన పిటిషన్పై సుప్రీంకోర్టులో 18న విచారణ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన నాలుగు పిటిషన్లపై విచారణ ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవటాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి సర్క్యూలేట్ అయిన లేఖ చదవలేదని...పూర్తి స్థాయిలో చదివిన తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడించారు.
కాగా విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేత, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు, డీఏ సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు టీడీపీ నేత పయ్యావుల కేశవ్, కృష్ణమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్లను కూడా న్యాయస్థానం 18న విచారణ చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, విభజన ప్రక్రియ తీరుతెన్నులను సవాల్ చేస్తూ పయ్యావుల కేశవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన సదాశివరెడ్డితో కలిసి 32వ అధికరణం కింద ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, పీఎంవో కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.