
ఫిరాయింపులు రాజకీయ వ్యభిచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన తీరు చూస్తే ఆయనకు
నిప్పులు చెరిగిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన తీరు చూస్తే ఆయనకు పార్లమెంటరీ వ్యవస్థపైన, చట్టాలపైన గౌరవం లేదనే విషయం తేటతెల్లమవుతోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. భూపోరాట సారథి చండ్ర రాజేశ్వరరావు 23వ వర్థంతి సభ ఆదివారం విజయ వాడలో జరిగింది. ఈ సందర్బంగా ‘పార్టీ ఫిరాయింపులు, ధన రాజకీయాలు, ఎన్నిక ల సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో సురవరం మాట్లాడారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీడీపీ నేత తలసాని శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో చంద్రబాబు గుండెలు బాదుకున్నారని, స్పీకర్, గవర్నర్ ఏం చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని నీతిబాహ్యమైన రాజకీయ వ్యభిచారంతో పోల్చిన బాబు ఏపీలో మాత్రం కాలానుగుణంగా ఫిరాయింపులని సమర్థించుకోవడం హేయమైన చర్యని దుయ్యబ ట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారన్నారు. వారితో రాజీనామా చేయించకుండా నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏం నీతి అని నిలదీశారు.