ముఖ్యమంత్రి చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
తిరుచానూరు: ముఖ్యమంత్రి చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశాలు మంగళవారం చిత్తూరు జిల్లా తిరుచానూరులో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన సురవరం మాట్లాడుతూ.. ఏ పార్టీతో జట్టు కడితే ఎన్ని మెట్లు ఎక్కొచ్చో లెక్కలు చూసుకుని మరీ చంద్రబాబు జతకడతారని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లు, ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు విఫలమయ్యారని పేర్కొన్నారు.
దేశంలో రైతుల ఆత్మహత్యలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు భంగం కలిగిస్తున్నాయని విమర్శించారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచేలా మీడియాను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. విద్యార్థి నేత కన్హయ్య మాటలను వక్రీకరించి ప్రసారం చేసిన జీటీవీ చైర్మన్‌కు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రధాని బహుమతిగా ఇచ్చారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ భారత్‌ను అమెరికాకు తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. అమెరికాలో నాలుగుమార్లు దివాలా తీసిన ఓ కంపెనీకి.. 4 లక్షల పది వేల కోట్ల రూపాయలతో దేశంలోని నాలుగు ప్రాంతాల్లో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులివ్వడమే దీనికి నిదర్శనమన్నారు.
అలాగే అమెరికా సైన్యం, యుద్ధ విమానాలను భారత్ భూభాగంలోకి అనుమతించేలా కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా నూతన శత్రుత్వానికి ప్రధాని ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రామానాయుడుతో పాటు రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.