
కాళ్లకింది భూమి కదిలిపోతోందనే భీతి కలిగింది కాబట్టే చంద్రబాబు భ్రమలనుంచి బయటపడి ప్రత్యేక హోదాకోసం పోరాడక తప్పదని గ్రహించారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు ఉన్నట్లుండి మారడమే బాబులో ఆకస్మిక మార్పునకు కారణమని, కానీ ఆయన పాలనపై ప్రజా ఆసంతృప్తి, అసమ్మతి తక్కువ స్థాయిలో మాత్రం లేదని పేర్కొన్నారు. తనపాలనపై ఇంత తీవ్రమైన నిరసన, వ్యతిరేకత కలుగుతుందని బాబు అస్సలు ఊహించలేదని, అందుకే బ్యాలెన్స్ కోల్పోతూ మాట్లాడుతున్నారని చెప్పారు. వామపక్షాలు పార్లమెంటులో సీట్లు గెలవవచ్చు గెలవకపోవచ్చు కానీ సంపద అపారంగా వ్యక్తుల చేతుల్లో పోగుపడుతున్నంత కాలం అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామంటున్న సురవరం సుధాకరరెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
బీజేపీయేతర శక్తులన్నీ ఏకం కావాలన్న ఆకాంక్ష సఫలమవుతుందా?
బీజేపీయేతర శక్తులన్నింటినీ ఐక్యం చేయాలన్న అంశం ప్రస్తుతం చర్చలోకి రాలేదు. బీజేపీని ఓడించడానికి ముఖ్యంగా సెక్యులర్ రాజకీయ పక్షాల మధ్య అవగాహన ఉండాలి. పరస్పరం పోటీ చేసుకోకుండా, బీజేపీకి వ్యతిరేకంగా బలమైన సెక్యులర్ అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. ఈ విధంగానే బీజేపీని కట్టడి చేయాలని, ఓడించాలనే ప్రయత్నం మాత్రం జరుగుతోంది.
నేటి పరిస్థితులు బంగారు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయా?
మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కేసీఆర్ చాలా విచిత్రమైన పద్ధతుల్లో పోతున్నారు. ఉద్యమాల ప్రాతిపదికన ఉద్యమ పార్టీని ఏర్పాటు చేసి గెలిచిన కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాలు, ప్రజాపోరాటాలు, నిరసనలు అంటేనే భయపడుతున్నారు. ధర్నా చేసుకోవడానికి కూడా అనుమతినివ్వని పరిస్థితి. ఒకరకమైన అభద్రతా భావం అది. అందరూ అనుకునేంత ధైర్యవంతుడు కాదు కేసీఆర్. ఆయన అపారమైన భీరువు. అందుకే ఏ అసమ్మతినీ భరించలేడు. ఏ అసంతృప్తినీ అంగీకరించలేడు. ధర్నాలకు భయపడే ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి అండీ. ఇదెలాంటి ప్రజాస్వామ్యం? ప్రజలంతా ఆయన వైపు ఉంటే ఇన్ని ఆర్భాటాలు, ఇన్ని బెదిరింపులూ, దబాయిం పులూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనైతిక పద్ధతుల్లో ప్రలోభపెట్టి కొనుగోలు చేయడాలు ఎందుకు? సచివాలయానికి రాకుండా పాలన చేయడమేమిటి? గతంలో రాజులు, నవాబులు కూడా దర్బారుకు వచ్చేవారు. ఆ పద్ధతుల్లో కూడా కేసీఆర్ లేరు. ప్రజాస్వామ్యం, పాలనా వ్యవస్థ పట్ల తేలిక భావానికి నిదర్శనం ఇది.
ఏపీలో తెలుగుదేశం, బీజేపీ విడిపోవడాన్ని ఎలా చూస్తున్నారు?
ఏపీలో కొంచెం మంచి పరిణామాలే జరిగాయని మేం భావిస్తున్నాం. చంద్రబాబు ప్రజలను అనవసరంగా భ్రమల్లోకి తీసుకెళ్లారు. రాజీపడిపోయి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక పథకం ఇస్తామంటే దానికీ ఒప్పుకున్నారు. కాని కేంద్రప్రభుత్వం ప్రత్యేక పథకం కింద కూడా సహాయం చేయలేదు. నాలుగేళ్ల తర్వాత ఆయన వాస్తవాలు గుర్తించారు. ఎన్నికల ముందు రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారడమే చంద్రబాబు దారి మార్పునకు కారణం. కాళ్లకింద భూమి కదిలిపోతోందనే భీతి కలిగింది కాబట్టే చంద్రబాబు హోదాకోసం పోరాడక తప్పదని గ్రహించారు.
బాబు పాలనలో.. బుల్ డోజర్లతో తవ్వినా తరగనంత అవినీతి ఉందని బీజేపీ ఆరోపణ?
చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి లేకుండా ఎలా ఉంటుంది? ఆయనపై అనేక రకాల ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తులుగా చేస్తున్నవి, ప్రభుత్వపరంగా చేస్తున్న అవినీతి చర్యలూ ఉన్నాయి. వీటికి సంబంధించి పత్రికల్లోనే చాలా వివరాలొచ్చాయి. బాబు అవినీతిని బుల్‌డోజర్లతోనే తవ్వనివ్వండి. ఏమున్నాయో బయటకు వస్తాయి కదా.
పోలవరం మొత్తం పరిణామాలు, ట్విస్టులపై మీ అభిప్రాయం?
పోలవరం ప్రాజెక్టుపై అనేక అనుమానాలు, తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మొదటినుంచి మా పార్టీ రాష్ట్రకమిటీ వీటిని ఎండగడుతూనే ఉంది. కాంట్రాక్టర్‌ను మార్చడానికి, కేంద్రంతో ఘర్షణ పడటానికి సంబంధించిన ఘటనల్లో తీవమైన ఆరోపణలు ఉండటం నిజం. దీనిపై అప్పట్లోనే విచారణ జరిపించాలని అందరూ అడిగారు.అప్పుడు ప్రభుత్వం అందుకు సిద్ధం కాలేదు. ఇప్పుడు విచారణ జరిగే అవకాశం ఉండొచ్చు.
శేఖర్ రెడ్డితో నారా లోకేశ్‌కు సంబంధం ఉందని పవన్ కల్యాణ్ తీవ్రాతితీవ్రంగా ఆరోపించారు. దానిపై మీ అభిప్రాయం?
నల్లధనం విషయం పక్కన పెట్టండి. శేఖర్ రెడ్డి అనే వ్యక్తి వద్ద కోట్ల రూపాయల మేరకు తెల్లధనమే ఎలా దొరికింది అని బీజేపీని అడిగితే చెప్పలేదు. కేంద్రాన్ని అడిగినా చెప్పలేదు. ఈ శేఖర్ రెడ్డిని ఎవరి సిఫార్సుతో చంద్రబాబు టీటీడీ బోర్డు సభ్యుడిగా చేశారో చెప్పాలి. చెప్పనప్పుడు ఇంకో ఆరోపణ కూడా వస్తుంది. డబ్బులిచ్చి మరీ శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాడంటున్నారు. ఎవరికి డబ్బులిచ్చాడు అనేది ప్రజలు తమకు తాము అర్థం చేసుకోవలసిన అంశం. నిజమేదో చంద్రబాబే చెప్పాలి కానీ చెప్పడం లేదు.
ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణంపై మీరెలా విశ్లేషిస్తారు?
ఏపీలో తీవ్రమైన అసంతృప్తి ఉందన్నది వాస్తవం. ఉదాహరణకు నంద్యాల ఉప ఎన్నికల్లో యావత్తు ప్రభుత్వం పాల్గొంది. ప్రభుత్వం తరఫునే ఓటర్లకు రూ. 70 కోట్ల వరకు పంచారని మాకు తెలిసిన సమాచారం. పార్టీ తరఫునా ఖర్చుపెట్టారు. మొత్తం కేబినెట్ నంద్యాలలో వాలిపోయింది. మరో 40 మంది ఎమ్మెల్యేలనూ అక్కడికి తరలించారు. మొత్తానికి గెలిచారు. ప్రభుత్వం మొత్తం పనిచేసినా తక్కువ మెజారిటీయే వచ్చింది. చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి, నిరసన ఉందని నంద్యాల ఫలితాలు తెలిపాయి.
చంద్రబాబు యావచ్ఛక్తినీ ఉపయోగించి వివిధ ఎన్నికల్లో పోరాడుతున్నా ఆశించిన ఫలితాలు, మెజారిటీ రావటం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గంపగుత్తగా పార్టీ మార్పించి ఫిరాయింపు చేసి ఉండొచ్చు కానీ దానిపై ప్రజల్లో అసమ్మతి, అసంతృప్తి గూడు కట్టుకునే ఉందన్నది వాస్తవం. తన పార్టీ ఎమ్మెల్యేలపైనే బాబుకు నియంత్రణ లేదు. అనేక చోట్ల వీళ్లు మాఫియాగా వ్యవహరిస్తున్నారు. అధికారులపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి దారుణాలన్నింటినీ చంద్రబాబు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బలపరుస్తున్నారు. జనంలో తీవ్ర అసంతృప్తి పెరగడానికి ఇవన్నీ కారణం.
చంద్రబాబు గతపాలనకూ, నేటిపాలనకూ తేడా ఏమిటి?
తనపాలనపై ఇంత తీవ్రమైన నిరసన, వ్యతిరేకత కలుగుతుందని చంద్రబాబు అస్సలు ఊహించలేదు. అందుకే బ్యాలెన్స్ కోల్పోతూ మాట్లాడుతున్నాడనిపిస్తుంది. నరేంద్రమోదీని కూడా నేనే అధికారంలోకి తెచ్చాను అని బాబు అనటం చాలా పెద్ద కామెంట్. కాంగ్రెస్ పార్టీ పట్ల దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతా ప్రభంజనం నేపథ్యంలో మోదీ ప్రధాని అయ్యారు. దాన్ని ఉపయోగించుకోవాలని బాబు ప్రయత్నించారు.
వైఎస్ జగన్ పాదయాత్రపై మీ పరిశీలన ఏమిటి?
పాదయాత్ర పట్ల మంచి స్పందన వస్తున్నట్లు చాలా చోట్ల కనపడుతోంది. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను తెలుసుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నానికీ ప్రజల మద్దతు ఉంటుంది. దానివల్ల జగన్‌కి రాజకీయంగా ప్రయోజనం తప్పక ఉంటుంది.
కేసీఆర్, చంద్రబాబు పాలనపై మీరు ఎవరికి ఎన్ని మార్కులిస్తారు?
ఇద్దరూ అవకాశవాద రాజకీయాల్లో రాటుదేలిపోయారు. చంద్రబాబు బీజేపీతో కలవడమే అతి తీవ్రమైన అవకాశవాదం. గుజరాత్ ఘటనల తర్వాత మోదీకి వ్యతిరేకమని బాబు అప్పట్లో స్పష్టంగా ప్రకటించారు. అధికారంలోకి రావడమే ప్రాతిపదికగా పెట్టుకున్నంత వరకు ఈ రకమైన అవకాశవాదాలు బాబు ఆచరిస్తూనే ఉంటారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ మీరిచ్చే సందేశం?
నిరంతరం ప్రజలకోసం పోరాడే వామపక్షాలనూ బలపర్చండి. మతోన్మాదులకు తెలుగు రాష్టాల్లో ఏ స్థానమూ లేకుండా చేయండి అన్నదే మా విజ్ఞప్తి.