నిఘా కళ్లకు గంతలు
రాజంపేట: స్మగ్లర్లు నిఘా కళ్లకు గంతలు కట్టి ఎర్రచందనం రవాణాలో సరికొత్త మార్గం ఎంచుకున్నారు. ఇన్నాళ్లుగా దుంగల రూపంలో విదేశాలకు ఎగుమతి చేసే విధానానికి స్వస్తి చెప్పి... బొమ్మల రూపంలో ఎర్రబంగారంను తరలిస్తున్నారు. బెంగళూరు పోలీసులు తాజాగా పలువురిని అరెస్టు చేయడంతో ఎర్రబొమ్మల స్మగ్లింగ్ వెలుగు చూసింది. దీంతో ఎపీ పోలీసులు అప్రమత్తమయ్యూరు. బొమ్మల రూపంలో భారీగా బరువు కలిగిన దుంగలను తరిలించడం వల్ల లబ్ధి పొందవచ్చునని స్మగ్లర్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు అటవీ నిఘా వర్గాలు గుర్తించారుు.
నాణ్యత కలిగిన దుంగలతో బొమ్మలను తయారుచేసి రూ50వేల నుంచి రూ.1లక్షదాకా అమ్ముతున్నారు. చైనాలో కిలోబరువు ఉన్న బొమ్మ రూ.2లక్షలు దాకా పలుకుతుంది. గ్రేడ్-1 దుంగలను కిలో రూ7వేల వంతను కొనుగోలు చేయడం ద్వారా బొమ్మల బిజినెస్ నిర్వహిస్తున్నారు. చైనా నుంచి బెంగళూరు, చెన్నై, గోవా తదితర పర్యాటక ప్రదేశాలకు వచ్చే విదేశీయులతో బొమ్మసైజు, బరువుపై ఆర్డర్లు తీసుకోవడం జరుగుతోంది. బెంగుళూరులోని హొసకోట వద్ద ఓ గోడౌన్ తీసుకుని అక్కడి నుంచి ఆర్డర్లు విదేశాలకు వెళుతున్నాయని అటు కర్నాటక, ఇటు ఆంద్రప్రదేశ్ పోలీసులు దృష్టి సారించారు.
పట్టుబడిన వారి నుంచి సమాచారం రాబేట్టందుకు రంగంలోకి యాంటీ రెడ్ శ్యాండిల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపినట్లు అటవీ వర్గాల సమాచారం. అయితే అధికారికంగా రాజంపేట ఫార్టెసు డివిజన్ పరిధిలో శెట్టిగుంట, లక్ష్మింగారిపల్లెలో కొయ్య బొమ్మల తయారీతో జీవనం సాగిస్తున్నారు. లే పాక్షికి ఈ బొమ్మలు సరఫరా చేస్తున్నారు. ఈ బొమ్మలు తయారు చేసే కళాకారులకు గతంలో ప్రభుత్వం ప్రోత్సాహం అందచేసిన సంగతి విధితమే. ఇప్పుడైతే ఆ పరిస్ధితులు కనిపించడంలేదు.
అటవీమార్గాల్లో నిఘానేత్రాలు..
శేషాచలం అటవీ మార్గాల్లో నిఘానేత్రాలు ఏర్పాటుచేసే దిశగా అటవీశాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కడప, రాజంపేట ప్రాంతాల పరిధిలో విస్తరించిన శేషాచల అటవీ ప్రాంతాల్లో సీసీ కెమారాలు పెట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తాజాగా హైదరాబాదులో ఇదే విషయంపై పీసీసీఎఫ్ జోసెఫ్ ఇతర అధికారులతో సమీక్షించారు. శేషాచలం అటవీ పరిధిలో రాజంపేట డివిజన్‌లో 57వేల హెక్టార్లు, కడప డివిజన్ పరిధిలో 20వేల హెక్టార్లలో, ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 48వేల హెక్టార్లలో విస్తరించి ఉందని అటవీ రికార్డులు చెపుతున్నాయి.
ఎర్రచందనం స్మగ్లింగ్‌తో చెట్ల సంఖ్య తగ్గిపోవడంతో వాటిని పరిరక్షించుకునేందుకు అటవీశాఖ దృష్టి సారించింది. ఎర్రచందనం చెట్లను లెక్కించే ప్రక్రియను కూడా ఇది వరకే చేపట్టారు. ఎర్రచందనం లెక్కతేల్చేందుకు ఇంటర్‌నేషనల్ ప్రమాణాలు కలిగిన కన్సల్టెంట్‌ను నియమించేందుకు సన్నాహాలు అటవీశాఖ చేస్తోంది.
సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి
శేషాచలంఅటవీ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి పెట్టింది. త్వరలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే అంశం పరిశీలిస్తున్నారు. చెక్‌పోస్టులలో కొయ్యబొమ్మలు వెళుతున్నా పట్టుకోవడం జరుగుతుంది. అటవీ ప్రాంతంలో చిన్న, పెద్దచెట్లను లెక్కిస్తున్నాం.
వెంకటేశ్, డీఎఫ్‌ఓ, రాజంపేట
నిఘా కళ్లు, ఎర్రచందనం, విదేశాలకు ఎగుమతి,
Surveillance eyes, red scandal, exported