కొత్త బంగారు లోకం! | sv university campus at pg classes start | Sakshi
Sakshi News home page

కొత్త బంగారు లోకం!

Published Sun, Jul 13 2014 2:59 AM | Last Updated on Fri, May 25 2018 3:26 PM

కొత్త బంగారు లోకం! - Sakshi

కొత్త బంగారు లోకం!

క్యాంపస్  ఓ అందమైన ప్రపంచం. సువిశాలమైన పకృతి ఒడిలో నెలకొల్పిన ప్రదేశం. భూలోక స్వర్గంగా అభివర్ణించవచ్చు. ఇక్కడ చదువులో పరిణితి సాధించడంతోపాటు కళలకు సానపెట్టకోవచ్చు. ఎటుచూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవన్నీ చూస్తే ఎవరికి మాత్రం క్యాంపస్‌లో అడుగుపెట్టాలనిపించదు. ఇది నిజమే. ప్రతి విద్యార్థీ ఈ క్యాంపస్‌ను ఒక్కసారి చూస్తే తాను అందులో చదవాలని, అక్కడ గడపాలని భావించక తప్పదు. అలాంటి సుందరస్వప్నం వచ్చింది. సోమవారం నుంచి పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులు క్యాంపస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఎన్నో ఆశల్ని, మరెన్నో ఆశయాల్ని, అందమైన ఊహల్ని, తల్లిదండ్రుల కలల్ని మోసుకొని వస్తున్నారు. ఇలాంటి కొత్తబంగారు లోకానికి స్వాగతం పలకడానికి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ సిద్ధమైంది.
 
- రేపటి నుంచి పీజీ తరగతులు   
- తరలిరానున్న విద్యార్థులు

 యూనివర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీకి 62 సంవత్సరాల చరిత్ర ఉంది. 1952లో రాయలసీమ ప్రాంతంలో ఉన్నత విద్యను అందించడానికి ఏర్పాటైన విద్యాలయం. జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి దీన్ని ప్రారంభించారు. సుమారు 1500 ఎకరాల్లో ఏర్పాటైన రాష్ట్రంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయం.
 
ప్రవేశం అంత సులువు కాదు
ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో మూడు కళాశాలలున్నాయి. ఆర్ట్స్ కళాశాల్లో 25 సబ్జెక్ట్‌లు, సైన్స్‌లో 33 , కామర్స్‌లో 4 సబ్జెక్టులున్నాయి. వీటి ద్వారా 2305 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశం కోసం సుమారు 12 వేల మంది ప్రవేశపరీక్ష రాశారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 11వరకు నిర్వహించిన కౌన్సెలింగ్ ద్వారా 1327 మంది క్యాంపస్ కళాశాలల్లో చేరారు. వీరందరికి సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
 
అందమైన భవనాలు
ఎంతో ఆకర్షణీయమైన, దృఢమైన భవన నిర్మాణాలు ఎస్వీయూ సొంతం.  తాజ్‌మహల్‌ను తలపించే గ్రంథాలయం.. దేశం గర్వించే ఇంజనీర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆలోచనతో రూపొందించిన శ్రీని వాస ఆడిటోరియం.. నాలుగువైపులా గడియారాలతో సమయాలను సూచిస్తూ, నిటారుగా, హుందాగా కన్పించే పరిపాలనా భవనం.. ఇవి మతసామరస్యానికి చిహ్నంగా చెప్పవచ్చు.  శ్రీనివాస ఆడిటోరియం ఒక్క పిల్లర్ కూడా లేకుండా నిర్మించడం ఎవరి మేథస్సు, అంచనాలకు అందని అద్భుత కట్టడం. దీనిపై శాస్త్రవేత్తల బొమ్మలు అద్భుతంగా చిత్రీకరించారు. పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో ప్రతినిత్యం ఏదో ఒక సదస్సులు జరుగుతుంటాయి. శ్రీనివాస ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకేసారి 1500 మంది ఇందులో కార్యక్రమాల్ని తిలకించవచ్చు.
 
కంప్యూటర్ సెంటర్
ఎస్వీయూనివర్సిటీలోని విద్యార్థుల కోసం కంప్యూటర్ సెంటర్ ఉంది. ఇందులో ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా ఉంది. బాలుర వసతిగృహాలవద్ద ఇంటర్‌నెట్ హబ్ ఉంది. దీన్ని రాత్రి వేళల్లో కూడా వాడవచ్చు.
    
హెల్త్ సెంటర్
ఎస్వీయూ విద్యార్థుల కోసం చక్కటి ఆరోగ్య కేంద్రం ఉంది. ఇందులో ఐదుగురు వైద్యులు ఉన్నారు. క్యాంపస్‌లో చేరిన వెంటనే విద్యార్థులందరికీ ఓపీ కార్డులు ఇస్తారు. అనారోగ్యం కల్గితే చికిత్స కోసం వెళ్లవచ్చు. రక్తపరీక్ష, ఎక్స్‌రేతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆధునిక పరికరాలు ఉన్నాయి. హెల్త్‌సెంటర్‌లో ఒక వైద్యుడు, ఒక నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర కేసుల్లో వైద్య సేవలందించడానికి వీలుగా రెండు అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.

చక్కటి తరగతి గదులు
క్యాంపస్‌లోని విద్యార్థులు విద్యనభ్యసించడం కోసం చక్కటి తరగతి గదులు, పర్నిచర్ ఉన్నాయి. కొన్ని విభాగాల్లో అత్యాధునిక సౌకర్యాలతో సెమినార్ హాళ్లు ఈ-తరగతి గదులు ఉన్నాయి. విద్యార్థులకు బోధించడం కోసం సుమారు 300 మంది నైపుణ్యం, సుదీర్ఘ అనుభవం కల్గిన అధ్యాపకులున్నారు. అధ్యాపకులు లేనిచోట అర్హత కల్గిన తాత్కాలిక అధ్యాపకులు విద్యార్థులకు విద్య అంది స్తున్నారు. ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాలకు ప్రకాశం భవన్, వామనరావు భవనాల్లో తరగతి గదులున్నాయి. సైన్స్ కళాశాల రెండు సైన్స్ బ్లాకుల్లో విస్తరించి ఉంది.

క్రీడా సదుపాయాలు
పలు క్రీడా సౌకర్యాలున్నాయి. సుమారు 50 ఎకరాల్లో స్టేడియం ఉంది. చక్కటి జిమ్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులున్నాయి. పలు మైదానాలు అందుబాటులో ఉన్నాయి.

అన్నమయ్య భవన్
విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ పొందడానికి అన్నమయ్యభవన్‌లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. వ్యక్తిత్వ వికాస శిక్షణ, భావప్రకటన నైపుణ్యాల పెంపుపై ఇక్కడ శిక్షణ  ఇస్తారు.

మూడు క్యాంటీన్లు
విద్యార్థులు సేదతీరడానికి, సరదాగా గడపడానికి పూర్ణ, అన్నపూర్ణ, సంపూర్ణ అనే మూడు క్యాంటీన్లు ఉన్నాయి.
 
లైబ్రరీ
చూడచక్కని రూపం, ఎదురుగా కూర్చొని చదవడానికి వీలుగా బల్లలు, హెమాస్‌లైట్లు, వాటిచుట్టూ వాటర్ ఫౌంటెన్లు, ఇవన్నీ దగ్గరగా పరిశీలిస్తే ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అనిపిస్తుంది. ఇందులో దా దాపు 4 లక్షల పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్ర రీ, కాంపిటేటివ్ సెల్, రెఫరెన్స్ సెల్ ఉన్నాయి. అలానే ఎన్నోరకాల దిన, వార, మాస పత్రిక లు, జర్నల్స్, అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు.
 
హాస్టల్ వసతి
ఎస్వీయూక్యాంపస్‌లో చేరిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. బాలురు కోసం పది, బాలికల కోసం 8 వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సుమారు ఐదు వేలమంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నా రు. వీరు భోజనం చేయడానికి వీలుగా అనుబంధ మెస్‌లు ఉన్నాయి. క్యాంపస్‌లో పీజీలో చేరిన విద్యార్థులందరికీ వసతి కల్పిస్తారు. ఇందులో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేయాలి. ఓసీ విద్యార్థులు రూ.6,750, బీసీ లైతే రూ.5,750, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.4,750  కాషన్ డిపాజిట్ చెల్లిం చాలి. అలానే మెస్ కార్డుకోసం అదనంగా రూ.2100 చెల్లించి వసతి, మెస్‌లో భోజన సౌకర్యం పొందవచ్చు.
 
లైబ్రరీని ఉపయోగించుకోవాలి
ఎస్వీయూనివర్సిటీలో చక్కటి లైబ్రరీ ఉంది. వీటిలో నాలుగు లక్షల పుస్తకాలున్నాయి. దిన, వార, మాస పత్రికలతో పాటు ఎన్నో జర్నల్స్ ఉన్నాయి. అలానే పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం కాంపిటెటివ్ సెల్ ఉంది. ఇందులో అన్నిరకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అవసరమైన పుస్తకాలున్నాయి. డిజిటల్ లైబ్రరీ ద్వారా ఆన్‌లైన్ జర్నల్స్ చూసుకోవచ్చు, నూతన విద్యార్థులు లైబ్రరీని బాగా ఉపయోగించుకోవాలి.                  - వి.షణ్ముగం, లైబ్రరీ ఉద్యోగి

సరైన వేదిక
 డిగ్రీ వరకు ఇంటిపట్టునే ఉండి చదువుకున్న విద్యార్థులు తొలిసారిగా తల్లిదండ్రులను వదలి క్యాంపస్‌లో అడుగు పెడుతున్నారు. యూనివర్సిటీల్లో ఎన్నో వసతులు, సౌకర్యాలున్నాయి. ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇది తలపిస్తుంది. పీజీలో చేరిన విద్యార్థులు రెండు సంవత్సరాలు ఇక్కడి సౌకర్యాలు వినియోగించుకొని బాగా చదివితే స్థిరపడవచ్చు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు.
 - ప్రొఫెసర్ సీ.ఈశ్వర్‌రెడ్డి, రిటైర్డ్ అధ్యాపకులు

ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చు
 ఎస్వీయూనివర్సిటీలో విద్యానభ్యసించిన వారు ఎంతో మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో పాటు మరెంతో మంది  గొప్పవారు ఇక్కడి విద్యార్థులే. రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఎస్వీయూనివర్సిటీ ప్రొఫెసర్లు వైస్‌చాన్స్‌లర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత వీసీ రాజేంద్ర కూడా ఇదే విశ్వవిద్యాలయంలో చదివిన వారే.
 - ప్రొఫెసర్ పి.శ్రీనివాసులరెడ్డి, తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు

ఇక్కడ చదవడం అదృష్టం
 ఎస్వీయూనివర్సిటీకి 60 సంవత్సరాలు చరిత్ర ఉంది. రాష్టం లోనే రెండో పెద్ద విశ్వవిద్యాల యం. ఇందులో చదవడం ఎంతో అదృష్టం. ఈ విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయి. చక్కటి లైబ్రరి ఉంది. వీటి ద్వారా విద్యార్థులు ఎంతో జ్ఞానం పొందవచ్చు. మరెన్నో పరిశోధన సంస్థలు ఉన్నాయి. చదువులో వెనుక బడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నాము.                 - ప్రొఫెసర్ ఉదయగిరి రాజేంద్ర,  వైఎస్‌చాన్స్‌లర్, ఎస్వీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement