వేదాలే మార్గదర్శకాలు
వేదాలను పాటించేవారు సమాజంలో అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తెలిపారు.
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: వేదాలను పాటించేవారు సమాజంలో అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలోని ప్రాచ్య పరిశోధన సంస్థలో మహాభారతంపై మంగళ వారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. శ్రీనివాస ఆడిటోరియంలో ప్రారంభమైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తన సందేశం అందించారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదన్నారు. గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మ విశిష్టతను తెలియపరుస్తున్నాయన్నారు. సనాతన ధర్మం వేదాల నుంచి వచ్చిందన్నారు. ఈ ధర్మమే అన్ని యుగాల్లో గొప్పగా నిలిచిందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం మహావిష్ణువు పది అవతారాలు ఎత్తారన్నారు. శ్రీకృష్ణుడు ధర్మపరిరక్షణలో కీలక పోత్ర పోషించాడన్నారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడుకి చేసిన గీతోపదేశం సారాంశం అన్ని కాలాలకు అనువర్తితం అవుతుందన్నారు. మహాభారతంలో లేని అంశాలే లేవన్నారు. అంద రూ ధర్మమార్గంలో నడిస్తే భారతదేశం విదేశాలకు ధీటుగా నిలుస్తుందన్నారు.
మనది పవిత్ర దేశం
విశిష్ఠ అతిథిగా హాజరైన రామానుజ మిషన్ ట్రస్ట్(చెన్నై)కు చెందిన చతుర్వేదస్వామి ప్రసంగిస్తూ భారతదేశం పవిత్రమైనదన్నారు. దేవుడు గొప్పవాడన్నారు. అలానే మానవులు ధర్మ పరిరక్షణ ధర్మాలు పాటించడం ద్వారా దైవత్వాన్ని పొందుతారన్నారు. పురాణాలు, శాస్త్రాలు దేవుడి గొప్పతనాన్ని వివరిస్తాయన్నారు. మహాభారతం, రామాయణం మహాకావ్యాలే కాకుండా అందులో సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలున్నాయన్నారు. ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ధర్మ పరిరక్షణే పరమార్థమని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పారన్నారు. అలానే మానవీయ విలువలు, నీతినియమాలు పాటించలేని వారు సమాజానికి అవసరం లేదన్నారు. భీమిలిలోని శివమహా పీఠాధిపతి కందుకూరి శివానందమూర్తి ప్రసంగిస్తూ ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుందని మహాభారతం ద్వారా తెలుస్తుందన్నారు.
41 రోజుల పాటు అంపశయ్యపైన నిలిచిన భీష్ముడు చనిపోతూ అర్జునుడికి బోధించిన హితోపదేశంలో అనేక అంశాలు ఉన్నాయని ఇవి ఏ కాలానికైనా అచరించదగినవని చెప్పారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ మాట్లాడుతూ రామాయణ, మహాభారతాలు ప్రస్తుత సమాజంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. మహాభారతాన్ని మేనేజ్‌మెంట్ పుస్తకంగా ఉపయోగించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీయూ వీసీ రాజేంద్ర అధ్యక్షత వహించారు. రెక్టార్ సుకుమార్, రిజిస్ట్రార్ కె. సత్యవేలురెడ్డి, ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ క్రాంత్ చౌదరి, సదస్సు నిర్వహణ కార్యదర్శి వేమూరి వెంకటరమణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.