సాక్షి, రాజమండ్రి : ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం, తదితర తమ డిమాండ్ల సాధన కోసం పురపాలక శాఖా మంత్రితో మున్సిపల్ ఉద్యోగులు, పారిశుధ్య ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు పిలుపు నిచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీల్లోని పారిశుధ్య సిబ్బంది సమ్మె బాట పట్టారు. ఈ ప్రభావం జిల్లాపై స్పష్టంగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకపక్క సమైక్యాంధ్ర నినాదంతో ఏపీ ఎన్‌జీఓలు సమ్మెలో ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ వేరైనా మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టడంతో జిల్లాలో పౌరసేవల నిర్వహణ మరింత స్తంభించనుంది. నిర్మాణాత్మక చర్యలు లోపించి ఇప్పటికే మున్సిపాలిటీలు మురికికూపాలుగా మారుతున్నాయి. ఈ తరుణంలో పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగడం పరిస్థితిని మరింత జఠిలం చేయనుంది. అధికారులు తాత్కాలిక ప్రత్యామ్నాయం చూపుతామంటున్నా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేమనే చెబుతున్నారు.
తాగునీటిపై ప్రభావం
రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 2994 మంది సమ్మెలోకి వెళ్తున్నారు. వీరిలో 1388 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా 1606 మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా పర్మినెంట్ ఉద్యోగులు సైతం శనివారం ఉదయం నుంచి విధులకు హాజరు కావడంలేదు. దీంతో ముందుగా తాగునీటి పంపిణీ వ్యవస్థకు విఘాతం ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. పారిశుధ్య నిర్వహణ స్తంభించి ఎక్కడికక్కడ రోడ్లపై చెత్త పేరుకుపోనుంది. ప్రధానంగా కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లోని ప్రధాన కూడళ్లు ఒక్కరోజుకే చెత్తతో నిండిపోతాయి. రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లు వ్యర్థాలతో నిండి ఉంటాయి. తెల్లవారాక వ్యాపార సమయానికల్లా వీటిని పారిశుధ్య పనివారు శుభ్రం చేస్తారు. కానీ శనివారం ఉదయం మార్కెట్లు చెత్తతో స్వాగతం పలకనున్నాయి.
ప్రత్యామ్నాయ చర్యల్లో అధికారులు
సమ్మె నోటీసుతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో కమిషనర్లు శుక్రవారం రాత్రే ఆ చర్యల్లో పడ్డారు. ఎంతమంది సమ్మెలోకి వెళ్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఎంతమందిని చూడాలన్న అంశంపై దృష్టి సారించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాకు ఉదయం అంతరాయం వాటిల్లకుండా రిటైర్డు ఉద్యోగులు, మహిళా సంఘాలు, రోటరీ, లయన్స్ క్లబ్, తదితర సంఘాల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం రాత్రికి రాత్రి మార్గదర్శకాలు ఇచ్చింది. మురుగుకాలువల్లో నీటి ప్రవాహం, డ్రైన్‌లు, మంచినీటి పైపుల లీకేజీలు, విద్యుత్తు సరఫరా, రవాణా వంటి అంశాల్లో ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే రవాణా, పోలీసు శాఖల అధికారుల సహకారం తీసుకోవాలని సూచనలు చేసింది. నీటి పథకాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. సమ్మెలో ఉన్న సిబ్బంది స్థానంలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చే వారిని గుర్తించి వారికి రాత్రికి రాత్రి శిక్షణ ఇవ్వాలని ఆదేశించడంతో ఇప్పుడెలా అంటూ జిల్లా అధికారులు తలలు పట్టుకున్నారు. కాగా సమ్మె ప్రభావం ఎలా ఉంటుంది. ఎంతమంది సమ్మెలో ఉంటారన్న విషయాలు శనివారం కానీ నిర్థారణ కాదని మున్సిపల్ ఆర్డీ రవీంద్రబాబు చెప్పారు.
సమ్మెలో పారిశుధ్య ఉద్యోగులు
Published Sat, Feb 8 2014 1:30 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement