భళారే.. బిర్యానీ | Swiggy 2019 nationwide survey reveals interesting facts | Sakshi
Sakshi News home page

భళారే.. బిర్యానీ

Published Tue, Dec 31 2019 4:14 AM | Last Updated on Tue, Dec 31 2019 4:14 AM

Swiggy 2019 nationwide survey reveals interesting facts - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడే ఆహారంగా బిర్యానీ వరుసగా నాలుగో ఏడాది కూడా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. అదే సమయంలో భారతీయుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వెలుగుచూశాయి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే కీటోజెనిక్‌ ఆహారం తీసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని ఫుడ్‌ డెలివరీ యాప్‌ సంస్థ స్విగ్గీ తాజాగా జరిపిన సర్వేలో తేలింది. స్టాట్‌‘ఈట్‌’స్టిక్స్‌ పేరిట స్విగ్గీ ఏటా నిర్వహించే సర్వేలో ఈసారి పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు దేశవ్యాప్తంగా 530కి పైగా స్విగ్గీ డెలివరీ కేంద్రాల సమాచారం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో సేవలందిస్తోంది. ఆన్‌లైన్‌ ఆహార సరఫరా మార్కెట్లో 50 శాతంపైగా వాటాతో స్విగ్గీ మొదటి స్థానంలో ఉండగా, 26 శాతం వాటాతో జొమాటో రెండో స్థానంలో ఉంది. మిగిలిన భాగాన్ని ఫుడ్‌పాండా, ఫాసోస్, బాక్స్‌ 8 వంటి యాప్స్‌ పంచుకుంటున్నాయి.

మార్కెట్లో 35,056 రకాల బిర్యానీలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,056 రకాల బిర్యానీలను సరఫరా చేస్తున్న స్విగ్గీ.. బోన్‌లెస్‌ చికెన్‌ బిర్యానీ, చికన్‌ దమ్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, ఎగ్‌ బిర్యానీ, వెజ్‌ బిర్యానీ, పన్నీర్‌ బిర్యానీలకే అత్యధికంగా డిమాండ్‌ ఉందని తేల్చింది. ముంబైలో ‘చాల్‌ థానో తావా బిర్యానీ’ అతి తక్కువ ధర రూ.19కే లభిస్తుంటే.. పూణేలో లభించే ‘చికెన్‌ సజక్‌ తప్‌’ బిర్యానీ రూ.1,500లతో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. అంతేకాదు.. ప్రతీ నిమిషానికి 95 మంది బిర్యానీని ఆర్డర్‌ చేస్తున్నారంటే దీనిపై భారతీయులకు ఉన్న మోజును అర్థంచేసుకోవచ్చు. నాన్‌వెజ్‌లో చికెన్‌ బిర్యానీ మొదటిస్థానంలో ఉండగా, శాఖాహారంలో మసాలా దోశ, పన్నీర్‌ బట్టర్‌ మసాలాకు ఎక్కువ డిమాండ్‌ ఉంది.

ఆరోగ్యమూ ముఖ్యమే..
ఈ ఏడాది భోజన ప్రియులు ఆరోగ్యకరమైన ఆహారం వైపు అత్యధికంగా మొగ్గు చూపుతున్నట్లు స్విగ్గీ సర్వేలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే కేలరీలు తక్కువగా ఉండే కీటోజెనిక్‌ ఫుడ్‌కి ఆర్డర్లు మూడు రెట్లు పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహార ఆర్డర్లు 306 శాతం పెరిగి 3.15 లక్షలకు చేరాయి. కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కాన్‌ చికెన్, హెల్దీ రెడ్‌ రైస్‌ పోహా వంటి వాటిని అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. ఇంటి వద్ద తయారుచేసే ఆహారానికీ ఆదరణ పెరుగుతోందట. ఈ ఏడాది పప్పు–బియ్యంతో తయారు చేసే కిచిడీ ఆర్డర్లలో 128 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇదే సమయంలో రాజ్మా చావల్, పెరుగు అన్నం వంటి వాటికి కూడా డిమాండ్‌ బాగుంది.

దూసుకుపోతున్న గులాబ్‌జామ్‌
ఇక తీపి పదార్థాలు, శీతల పానీయాల విషయానికి వస్తే.. అత్యధిక ఆర్డర్లతో గులాబ్‌జామ్‌ దూసుకుపోతోంది. ఈ ఏడాది పది నెలల కాలంలో 17.69 లక్షల మంది గులాబ్‌జామ్‌ కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత 11.94 లక్షల ఆర్డర్లతో ఫలూదా రెండో స్థానంలో నిలిచింది. శీతల పానీయాల్లో ఫలూదాకు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్‌ పెరగడంపై స్విగ్గీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కేకుల్లో బ్లాక్‌ ఫారెస్ట్‌ 3 లక్షల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది. డెత్‌ బై చాక్లెట్, టెండర్‌ కోకోనట్‌ ఐస్‌క్రీం, తిరమిసూ ఐస్‌క్రీం, కేసరి హల్వాలను కూడా అత్యధికంగా ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఒకేరోజు అత్యధిక ఆర్డర్లు ఇవ్వడం ద్వారా భోజన ప్రియులు ఈ ఏడాది ప్రత్యేకంగా కొత్త జాతీయ ఆహార తేదీలను కూడా ప్రకటించుకున్నారట. ఫిబ్రవరి 17 జాతీయ గులాబ్‌జామ్‌ డే,  మే 12 కాఫీ డే, జూన్‌ 16 ఫ్రెంచ్‌ ఫ్రైస్, సెప్టెంబర్‌ 22 పిజ్జా, అక్టోబర్‌ 20 బిర్యానీ, టీ డేలుగా ప్రకటించుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement