
స్టేషన్ వద్ద ధర్నా చేశారన్న కారణంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను..
సాక్షి, అనంతపురం : తాడిపత్రి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయం వైపున నిలబడాల్సిన వాళ్లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. కోన ఉప్పలపాడులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ జేసీ వర్గీయులను అరెస్ట్ చేయకుండా.. యాడికి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారన్న కారణంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను నిర్భందించారు. పోలీసుల తీరుపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అసలేం జరిగింది.. వాల్టా చట్టానికి విరుద్ధంగా జేసీ ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డి బోరు వేస్తున్నారని.. వైఎస్సార్ సీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. తమపై అధికారులకు ఫిర్యాదు చేశారన్న అక్కసుతో జేసీ వర్గీయులు వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. అయితే వైఎస్సార్ సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో పోలీసుల ఏకపక్ష వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ నేత పెద్దారెడ్డి యాడికి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడికి పాల్పడ్డ జేసీ వర్గీయులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.