ఆళ్లగడ్డ ఎన్నికల్లో పోటీ చేయం: టీడీపీ
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని అధికార టీడీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పాత సంప్రదాయాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే మృతితో జరిగిన కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో టీడీపీ ఇదే సంప్రదాయాన్ని పాటించనున్నట్టు కేఈ తెలిపారు. అభ్యర్థిని నిలపాలని కర్నూలు జిల్లా నేతలు కొందరు ప్రతిపాదించినా టీడీపీ నాయకత్వం తిరస్కరించింది.
గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల షెడ్యూలు :
నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు
పరిశీలన - ఈనెల 22న
ఉపసంహరణ - ఈనెల 24న
పోలింగ్ - నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న