‘పచ్చ’ ముచ్చటకు రూ.10 కోట్లు
కార్మికుల సొమ్ముతో ఆర్టీసీ బస్సులకు పసుపు పచ్చ రంగు
సాక్షి, హైదరాబాద్: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే మరి! పల్లెవెలుగు బస్సులను ‘పచ్చ’ రంగుతో అలకరించేందుకు ఆర్టీసీ కార్మికుల సొమ్ముకు సర్కారు ఎసరు పెట్టింది. కొత్తగా ప్రవేశపెడుతున్న వాటితోపాటు పాత బస్సులకూ తమ పార్టీ రంగు పసుపు రంగులోకి మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి నాటికి రాష్ట్రంలోని 123 డిపోల్లోని పల్లెవెలుగు బస్సులతో పాటు హైటెక్, లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులకు పసుపు పచ్చ రంగు పడనుంది. హైటెక్, లగ్జరీ బస్సులకు బోర్డర్ పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసి దాచుకున్న డబ్బును వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
సరైన నిర్వహణ లేకుండా రంగులెందుకు?
ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల నిర్వహణ సరిగా లేదు. సీట్లలో కూర్చొంటే నల్లులు బాధ తప్పడం లేదని స్వయానా రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బస్సుల రంగు కోసం నిధులు వినియోగించటం సరికాదని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించి ఆర్టీసీకి మొండిచేయి
విమాన ఇంధనంపై వ్యాట్ శాతాన్ని ఇటీవలే ప్రభుత్వం 16 నుంచి 1 శాతానికి తగ్గించింది. దీనివల్ల రాష్ట్రంలో విమానయానం పెరుగుతుందని చెబుతోంది. ప్రభుత్వానికి ఏటా రూ.25 కోట్ల వరకు నష్టం వాటిల్లుతున్నా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంటోంది. ఆర్టీసీకి కూడా ఇంధన రాయితీ కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి కార్మిక సంఘాలు కోరుతున్నాయి. డీజిల్‌పై వ్యాట్ శాతం తగ్గించాలని కోరినా పట్టించుకోని ప్రభుత్వం సంపన్నులు ప్రయాణించే విమానాలపై మాత్రం ఇంధనం వ్యాట్ తగ్గించడాన్ని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. ఆర్టీసీకి నష్టాలు రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలేనని మండిపడుతున్నారు.