టీడీపీ అంటే టోటల్ డీఫాల్టర్ పార్టీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై గిద్దలూరు వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త ఐవీ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీని టోటల్ డీఫాల్టర్ పార్టీగా మార్చి భ్రష్టు పట్టించిన ఘనత ఆయనకే దక్కుతుందని విరుచుకుపడ్డారు. వాకాటి నారాయణరెడ్డిని సస్పెండ్ చేసి ఏదో గొప్ప పని చేసుకుంటున్నట్లు చెప్పుకొంటున్న చంద్రబాబు.. అదే పార్టీ నుంచి ఎంపీగా ఉన్న సుజనా చౌదరి విషయంలో ఏం చేశారని ప్రశ్నించారు. తమ బ్యాంకుల వద్ద సుజనా తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాంటూ చివరకు బ్యాంకు సిబ్బంది ఆయన ఇంటి ఎదుట రోడ్డు మీద ధర్నా చేసేవరకు తెచ్చుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో సైతం భూకబ్జాలకు తెగబడితే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఆయన తోకముడిచారని, అలాంటి వాళ్ల మీద చర్యలేవని ఐవీ రెడ్డి ప్రశ్నించారు.
ఉప ముఖ్యమంత్రి కుమారుడే కర్నూలు జిల్లాలో ఇసుక దోపిడీకి తెగబడితే చివరికి కోర్టు జోక్యం చేసుకుని కలెక్టర్‌కు అక్షింతలు వేసే దాకా వచ్చిందని, వీళ్ల మీద ఏదైనా చర్యలు తీసుకుంటే అందరు హర్షిస్తారన్నారు. తెరమీద సస్పెండ్ చేసినట్లు చూపించి, తెరవెనుక కావాల్సిన వారిని దువ్వుతూ కూర్చోవడం చంద్రబాబు నైజమని విమర్శించారు. ముందు నుంచి అవినీతికి కొమ్ము కాస్తూ ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కథలు చెప్పడం చందమామను అద్దంలో చూపించి నిజమనుకునేంత కామెడీగా ఉందని చురక వేశారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న అవినీతిపరులందరినీ తన బృందంలో ఉంచుకుని తన అవినీతిని ప్రశ్నించినవారిపై బురద చల్లడం మానుకోకపోతే ఎన్నికలలో సిట్టింగ్ ఎమెల్యేలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. తెలుగు తమ్ముళ్ల అవినీతి మొత్తం నాయకుడైన బాబు ఆధ్వర్యంలోనే జరిగిందని ఇప్పుడు కొత్తగా చిలక పలుకులు చెబితే ఎవరు నమ్మే స్థితిలో లేరని అన్నారు. అవినీతిని పెరట్లో ఉంచుకుని ఇలా చెలరేగుతున్న బాబు పాలనకు రోజులు దగ్గర పడ్డాయని ఐవీ రెడ్డి జోస్యం చెప్పారు.