
నంద్యాలలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ లో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. ఇళ్లకు అడ్డంగా ఇసుక డంప్ ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన మహిళలపై గురువారం ఉదయం ఎదురుదాడి చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్ సీపీకి ఓటేశారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తిని టీడీపీ నేతలు కొట్టారు. దీంతో తమపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్త సుబ్బయ్య కక్షసాధింపు చర్యతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులపై దాడికి దిగాడు. నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీకి ఓటు వేయడంతో... కావాలనే టీడీపీ నాయకుడికి సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డం పెట్టారు. రోడ్డుకు అడ్డంపెట్టి అసౌకర్యం కలిగిస్తున్నారని అడిగినందుకు మహిళ అని కూడా చూడకుండా నానా దుర్భాశలాడుతూ మహిళ చీర లాగి కొట్టారు. అడ్డుకోబోయిన పక్కింటి మహిళను కూడా కొట్టారు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు.