రాజు మారితే రాజ్యం మారిపోవాలా అని ఇటీవల ఓ నేత పదం బాగుంది కదా అని ఓ ‘డైలాగ్’ వదిలాడు. ఆ డైలాగ్ ప్రకారమే ముందుకెళ్దాం. ఔను... రాజు మారితే అందుకు అనుగుణంగా పాలన కూడా మారుతోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ‘యథా రాజా తథా ప్రజలు, అధికారులు’ అనడానికి కూడా పెద్దాపురం నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. టీడీపీ హయాంలో పెద్దాపురాన్ని ఓ సామంత ‘రాజు’ ఏలేవారు. పాలించే రాజు అక్రమాల చక్రవర్తి కావడంతో సామంత రాజులు, ఆయన అనయాయులు నీతి వాక్యాలు వల్లిస్తూ కూర్చోరు కదా...వీరు దందాలు చేయడం ప్రారంభించారు. ‘తిలా పాపం తలా పిడికెడు’ చందంగా చేతికందినకాడికి దోచేసుకున్నారు. చివరకు 688 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఇచ్చిన 823 ఎకరాలను కూడా వదలకుండా గుల్ల చేసేశారు.
అప్పటి ‘రారాజు’ అండ చూసుకొని ... అధికారులను పక్కకు నెట్టేసి, పెద్దాపురం ‘సామంతరాజు’ కనుసైగలతో కబ్జా చేసి కోట్ల రూపాయల విలువైన గ్రావెల్‌ను కొల్లగొట్టేశారు. ఈలోగానే రాష్ట్రంలో రాజు మారారు...జిల్లా అధికారీ మారారు...అయితే గ్రహపాటున ఆ నియోజకవర్గ సామంత‘రాజు’ మాత్రం మారలేదు. దీంతో వారి అనుచరుల బుద్ధీ మారలేదు. పాత పద్ధతిలోనే అక్రమాల బాట పట్టడంతో కొత్త రాజ్యంలో ఆ దూకుడుకు కళ్లెం వేశారు. అర్ధరాత్రి కూడా ఆకస్మిక తనిఖీలు చేయడంతో కబ్జాదారులకు ముచ్చెమటలు పట్టాయి. చిత్తశుద్ధి ఉండే రాజు కొరడా ఝుళిపిస్తే ‘మారాల్సిందే’... మార్పు రావల్సిందే’ అనడానికి ఇదే... ఇదే ‘పెద్ద’ ఉదాహరణ.
సాక్షి, రాజమహేంద్రవరం : అధికారం ఉన్నన్నాళ్లు అడ్డగోలుగా దోచుకున్న గ్రావెల్ మాఫియా ధనదాహం ఇంకా తీరినట్టు లేదు. అధికారం పోయినా ‘పచ్చ’నేతల పాపాలకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. గడచిన మూడేళ్లుగా పెద్దాపురం సమీపాన రామేశంమెట్ట కొండను పిండిచేసి టీడీపీ నేతలు, వారి వందిమాగదులు కోట్లు దోచుకుపోయారు. 1985 నుంచి 1995 వరకూ 688 మంది నిరుపేద దళితులకు అసైన్ చేసిన 823 ఎకరాల భూములపై పడి గుల్ల చేసేశారు. సాగుకు అనువుగా తీర్చిదిద్దుతామనే సాకుతో ఇందులో మూడొంతులు కొండను దోచుకున్నారు. చంద్రబాబు ఏలుబడిలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప బినామీలు ఈ విచ్చలవిడి దోపిడీలో క్రియాశీలకపాత్ర పోషించారు. అప్పటి అధికారులు కూడా ‘అత్త సొమ్ము అల్లుడు దానం’ చేసిన చందంగా అనుమతులపై అనుమతులు ఇచ్చేశారు.
ఒక లబ్థిదారుకు ఎకరా 30 సెంట్లు భూమి ఇస్తే వాటిని చదునుచేసి సాగుకు అనుకూలంగా మలిచి ఇస్తామని రెండు లక్షలు చేతిలోపెట్టి దోపిడీకి రాచబాట వేశారు. అటువంటి రామేశంమెట్టను సంస్కరించి తిరిగి హక్కుదారులైన దళితులకు అప్పగించి జీడిమామిడి, మామిడి మొక్కలను సాగులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి గురువారం తొలి అడుగు వేశారు. లబ్థిదారులను పిలిపించి వారికి నచ్చజెప్పి తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడకుండా గ్రావెల్ తవ్వకాలకు భూములు ఇవ్వవద్దని హితబోధ చేశారు. అంతటితో ఆగకుండా భూముల్లో మొక్కలు కూడా నాటి, మొత్తం భూమిని సర్వేచేసి లబ్థిదారులకు అప్పగించడమే కాకుండా మైనింగ్, ఉద్యానవన, రెవెన్యూ శాఖల సమన్వయంతో బోర్లు వేయించి నీటి సౌకర్యాన్ని కూడా కల్పించే దిశగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశకు సూచనలు కూడా ఇచ్చారు.
కలెక్టర్ ఆదేశించినా...
కలెక్టర్ ఆదేశాలు జారీచేసి 24 గంటలు కూడా గడవకుండానే గ్రావెల్ మాఫియా మరోసారి విజృంభించింది. అనుమతి ఉన్న భూమిలో గ్రావెల్ తవ్వాల్సి ఉండగా, అనుమతి లేని ప్రాంతంలో అర్థరాత్రి అడ్డగోలుగా దోపిడీకి తెరతీసింది. రామేశంమెట్టలో కొండ్రు పార్థుడుకు చెందిన 28/5 సర్వే నెంబర్‌లో గ్రావెల్ తవ్వకానికి అనుమతి ఉందని పెద్దాపురం రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పార్థుడు ఈ భూమిలో హక్కుదారుడు. కొండపల్లి మాజీ సర్పంచి కూడా. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడు. ఇతని భూమిని విడిచిపెట్టేసి అనుమతి లేని 26/7 సర్వే నంబర్‌లోని బక్కి లక్ష్మమ్మకు చెందిన భూమిలో అడ్డగోలుగా గ్రావెల్ తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ బాగోతం ఎన్ని రోజులుగా జరుగుతుందో ఇదమిద్ధంగా అ«ధికారులు కూడా చెప్పలేకున్నారు. కానీ గత నెల 29వ తేదీన జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్లే సరికి మాత్రం తవ్వకాలు నిలిచిపోయి ఉన్నాయి.
30వ తేదీ అర్థరాత్రి దాటాక జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి వచ్చిన సమాచారంతో పెద్దాపురం ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దార్ పద్మావతి సిబ్బందితో దాడిచేసి 12 లారీలు, రెండు పొక్లెయిన్లు సీజ్‌చేశారు. అంత అర్థరాత్రి సమయంలో ఘటనా స్థలంలో ఉన్న పార్థుడు పాత్రపై రెవెన్యూ యంత్రాంగం లోతుగా పరిశీలన జరుపుతోంది. దీని వెనుక పాత్రధారులెవరెవరున్నారనే అంశాలపై విచారణ జరుపుతోంది. సీజ్ చేసిన వాహనాలకు ఎంత అపరాధ రుసుం విధించాలి, ఏ సెక్షన్లపై కేసు నమోదు చేయాలనే అంశాన్ని పెద్దాపురం రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులతో చర్చిస్తున్నారు.
నాలుగు నెలల కిందటి వరకూ నిలువు దోపిడీ...
ఇప్పుడంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గ్రావెల్, ఇసుక విధానంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, జిల్లా కలెక్టర్ ఇచ్చిన ధైర్యంతో రెవెన్యూ అధికారులు అర్థరాత్రి కూడా దాడులు చేయగలిగారు. కానీ నాలుగు నెలల కిందటి వరకూ టీడీపీ నేతలు ఈ మెట్టను గుల్ల చేస్తూనే ఉన్నా అటువైపు కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోయారు. ప్రభుత్వమే తమ చేతుల్లో ఉందనే ధైర్యంతో ‘పచ్చ’ మాఫియా బరితెగించి కోట్లు కొల్లగొట్టేసింది. రామేశంమెట్ట నుంచి రోజుకు 150 లారీల గ్రావెల్ తరలించుకుపోయారు. ఒక లారీ గ్రావెల్ రూ.2000 వంతున విక్రయించారు. ఏడాదిలో 300 రోజులు యథేచ్ఛగా గ్రావెల్ తరలించుకుపోయారు.
ఈ లెక్కన ఏడాదికి ఎంత తక్కువగా చూసుకున్నా రూ.9 కోట్లు నిలువునా దోచుకున్నారని చెప్పొచ్చు. అంటే మూడేళ్లు (2016 నుంచి 2019 ఫిబ్రవరి) దోపిడీ విలువ లెక్కగడితే సుమారుగా రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఇన్ని కోట్లు కొల్లగొట్టుకుపోయినా ఇంకా దోచుకోవడానికి వెనుకాడటం లేదు. పెద్దాపురం ఏడీబీ రోడ్డు విస్తరణ పనుల పేరుతో గ్రావెల్ మాఫియా ఇక్కడి గ్రావెల్‌ను తరలించుకుపోతోంది. ఈ దోపిడీని కఠిన చర్యల ద్వారానైనా జిల్లా యంత్రాంగం అడ్డుకట్ట వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment