
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం): అధికారం ఉంటే ఏపనైనా చేయచ్చు. గిరిజనులైనా, ఇతరులైనా..ముప్‌పై సంవత్సరాల వయస్సులో భర్త చనిపోయాడు. అత్తా మామలతో పాటు ఇద్దరు ఆడపిల్లలను పోషించాలి. భర్త చనిపోయిన కారణంగా చంద్రన్న బీమాగా రూ.2 లక్షలు వచ్చింది. ఈ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని భావించిందా గిరిజన మహిళ. కానీ వచ్చిన సొమ్ముపై కన్నేసిన ఓ టీడీపీ నాయకుడు అమాయక గిరిజనురాలిని మాయచేసి రూ.లక్షను గెద్దలా తన్నుకుపోయాడు.
వివరాల్లోకి వెళితే పాతమల్లంపేట పంచాయతీ శివారు అచ్చియ్యపేట గ్రామానికి చెందిన కెల్లా శివ(30) గత నవంబర్ 2018లో చనిపోయాడు. ఆయనకు చంద్రన్న బీమాగా రూ.1,95,000 భార్య వెంకటలక్ష్మి పేరున గొలుగొండ ఎస్‌బీఐలోని అకౌంట్‌లో జమచేశారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకుడు, వైస్ ఎంపీపీ తండ్రి గెడ్డం నానాజీ గిరిజనులకు గేలం వేశాడు. నీకు బీమా సొమ్ము వచ్చిందని, ఈ సొమ్ము నేను కృషి చేయడం వల్లనే వస్తోందని, నేను డబ్బులు మార్చి ఇస్తానని అమాయక గిరిజనురాలైన వెంకటలక్ష్మి, ఆమె తల్లి పార్వతిని గొలుగొండలోని బ్యాంకుకు తీసుకొచ్చాడు. విత్‌డ్రా వోచర్‌పై సంతకాలు పెట్టించి రూ.1,90,000 డ్రాచేశాడు. అందులో లబ్ధిదారైన వెంకటలక్ష్మికి రూ.90 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ము తర్వాత వస్తుందని నమ్మబలికాడు.
అంతే కాకుండా బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, డెత్ సర్టిఫికెట్స్‌ను తనతో తీసుకుపోయాడు. ఈ వ్యవహారం 3 డిసెంబర్ 2018న జరిగింది. అయితే విషయం తెలియని గిరిజనులు మిగతా రూ.లక్ష వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా మొత్తం నగదును ఆరోజే తీసుకున్నట్టుగా తెలియడంతో లబోదిబోఅంటూ గిరిజనురాలు నెత్తీనోరు బాదుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామంలో వివరించింది. తనకు న్యాయం చేయాలని విన్నవించింది. విషయం తెలుసుకున్న మోసగాడు నానాజీ ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి ఆజ్ఞాతంలోకి పోయాడు. దీనిపై బాధితురాలు గిరిజన సమైక్య మండలికి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. టీడీపీ నాయకుడు చేసిన మోసంపై సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి అయ్యన్నకు శనివారం ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.
మొత్తం సొమ్ము జమ చేశాం
ఈ విషయమై బీమా మిత్ర వెంకటలక్ష్మిని సంప్రదించగా నామినీ పేరున రూ.1,95,000 ఆమె అకౌంట్‌లో జమచేయడం జరిగిందని, నాయకులు ఏం చేశారో తనకు తెలియని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment