అత్తారింటికి దారేది?
కాపురానికి పిల్చుకెళ్తామంటూ ఉన్నదంతా ఊడ్చుకున్నారు
టీడీపీ నేత అండతో కోడలిని మోసగించిన అత్త, మామలు
భర్త కోసం వెళ్తే చంపుతామంటూ బెదిరింపులు
న్యాయం కోసం మళ్లీ పోలీసులను
ఆశ్రయించిన బాధితురాలు
వైవాహిక జీవితంపై అందరి ఆడపిల్లల్లాగే ఆమె ఎన్నో కలలు కంది. ఆ సమయం రానే వచ్చింది. కాబోయే భర్త కువైట్‌లో సంపాదిస్తున్నట్లు తెలిసి ఆమె ఆనందానికి అవధుల్లేవు. పెళ్లైంది. భర్తతో కలసి తనూ విమానం ఎక్కేసింది. అక్కడ దాంపత్య మధురిమలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపింది. అంతలోనే తమ ప్రతిరూపం కడుపులో పెరుగుతోందని తెలిసి సంబరపడింది. కాన్పు కోసమంటూ భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ తరువాత పండంటి మగబిడ్డతో తిరిగి అత్తారింటికి వెళ్లింది. అంతే అక్కడి నుంచి ఆమెకు కష్టాలు
మొదలయ్యాయి. బాధితురాలి కథనం ప్రకారం...
రాయచోటి మహ్మద్‌పూరా వీధికి చెందిన దిల్‌షాద్, సుబక్‌తుల్లా దంపతుల కుమార్తె సుల్తాన వివాహం రాజంపేటకు చెందిన ఇస్మాయిల్‌తో మూడేళ్ల కిందట అయింది. పెళ్లైన కొత్తలో భార్యను వెంటబెట్టుకుని ఇస్మాయిల్ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె నెల తప్పింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కాన్పుకోసమంటూ స్వదేశానికి వచ్చారు. నెలలు నిండాక పుట్టింటిలో సుల్తాన మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో కలసి అత్తగారింటికి వెళ్లిన సుల్తానకు చేదు అనుభవమే ఎదురైంది. ఇంట్లోకి రావొద్దంటూ అత్తమామ అడ్డుకున్నారు. ఊహించని ఈ సంఘటనతో ఆమె ఖంగుతింది. ఈ సంఘటనపై ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆయన సూచన మేరకు రాయచోటి పోలీసులు కేసు నమోదు చేశారు.
కాపురానికి తీసుకెళ్తానని చెప్పి...
సుల్తాన ఫిర్యాదు నేపథ్యంలో ఆమె భర్త కువైట్ నుంచి వచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. తన భార్యను కాపురానికి పిల్చుకెళ్తానని నమ్మబలికాడు. పోలీసులు ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిద్దరి అంగీకారంతో కాపురానికి పంపారు. ఆ తరువాత కువైట్‌కు వెళ్తానని ఇస్మాయిల్ చెప్పాడు. అంత దూరం వద్దంది. ఇక్కడే వ్యాపారం చేద్దామంటే తన వద్ద పైసల్లేవనడంతో సుల్తాన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పెద్దమనుషులు సమక్షంలో పంచాయీతీ చేసి అదనంగా రూ.4 లక్షల నగదు, 30 తులాల బంగారం ఇచ్చి కాపురానికి పంపారు. ఆ పంచాయితీలో కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫిర్ధోసి అనే వ్యక్తికి ఇస్మాయిల్ పాస్‌పోర్టు అప్పగించేలా పెద్దలు ఒప్పందం కుదిర్చారు. అంతా అయ్యాక ఫిర్దోసి, ఇస్మాయిల్ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫిర్దోసి నుంచి తన పాస్‌పోర్టును ఇప్పించుకుని ఇస్మాయిల్ రెండు నెలల కిందట కువైట్‌కు చెక్కేశాడు. ఆ తరువాత సుల్తానను అత్తామామలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
దీనిపై సుల్తాన పుట్టింటి కొచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు మళ్లీ పంచాయితీ కోసం పెద్ద మనుషుల వద్దకు వచ్చారు. పంచాయితీకి ఇస్మాయిల్ తల్లిదండ్రులు ససేమిరా అనడగమే గాకుండా వియ్యంకులను, కోడలిని బెదిరించడం మొదలు పెట్టారు.
దీంతో బాధితురాలు మళ్లీ న్యాయం కోసం రాయచోటి పోలీసులను బుధవారం రాత్రి ఆశ్రయించారు. గతంలో పంచాయితీ చేసిన పెద్ద మనుషులను పిలిపించి సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అవతలి వారు టీడీపీ నాయకుని అండగా ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేత అనుచరుడు పోలీస్‌స్టేషన్‌లోనే బాధితురాలి బంధువులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.