సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలుగుదేశం అధికార ప్రతినిధి వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గురువారం ఎన్‌టీఆర్ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు 1999లో జి.చిన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేసేలా వైఎస్ ప్రోత్సహించారన్నారు.
2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారని, 2009 ఎన్నికలకు ముందు అసెంబ్లీలో రోశయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చే స్తున్నట్లు ప్రకటించారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తొలి ప్లీనరీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశారని, షర్మిల పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా పుల్లూరులో సభలో తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వైఎస్ విజయమ్మ చెప్పారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆయా అంశాలకు సంబంధించిన వీడియో టేపులను ప్రదర్శించారు. రోశయ్య నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ మాట్లాడిన మాటల్లో కొన్నింటిని మాత్రమే వీడియోలో ప్రదర్శించారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని ఆయన చెప్పిన విషయాన్ని చూపలేదు.
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి ప్రతినిధిని ఈ విలేకరుల సమావేశానికి ఆహ్వానించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. ఒకవేళ ఈ సమావేశానికి ఆహ్వానించి ఉంటే ఈ క్రింది ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించేది.
*2004 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరస్కరించడంతో తిరిగి 2009 సాధారణ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో 2008 అక్టోబర్‌లో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా లేదా?
* 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన మీ పార్టీ ప్రతినిధులు తెలంగాణ ఏర్పాటును కోరింది వాస్తవం కాదా?
* వస్తున్నా మీకోసం పాదయాత్రను తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారన్న భయంతో 26 సెప్టెంబర్ 2012న ప్రధానికి తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని మీ అధినేత లేఖ రాసింది నిజమా కాదా?
* కేంద్రం హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పలేదా?
* కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు.. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల ఖర్చును కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారా, లేదా?
* సీమాంధ్రలో ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు 10 రోజుల పాటు చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా ఇంటికే పరిమితమైన విషయం వాస్తవం కాదా?
* తెలుగువారి ఆత్మగౌరవం కోసం దివంగత ఎన్టీఆర్ ఎంతగానో పోరాడారు. ఆయన్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేసే అర్హత ఉందంటారా?