
అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ నేతలు
►హత్యా రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షంపై ఎదురుదాడా?
►హత్యలపై చర్చకు రాకుండా జగన్‌పై విమర్శలు చేస్తారా?
►అవినీతికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ నేతలు
►వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం
పట్నంబజారు(గుంటూరు) : అధికారంలోకి రాగానే హత్యా రాజకీయాలు చేస్తున్న టీడీపీ నేతలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ఎదురుదాడి చేసి ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. శాసనసభలో టీడీపీ శాసనసభ్యులు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా ఉందని మండిపడ్డారు. స్థానిక అరండల్‌పేటలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇతరులను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు.
టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోమని చెప్పని స్పీకర్, జగన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఉపసంహరించుకోవాలనడం ఆయన పక్షపాత వైఖరిని రుజువు చేస్తోందన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర ఏమీ లేదని సీబీఐ తేల్చిచెప్పిన సంగతి టీడీపీ నేతలు మరిచిపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక, జగన్‌పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా,జర్నలిస్టు పింగళి దశరథరామ్, మల్లెల బాబ్జీలను టీడీపీ నేతలే హతమార్చినట్టు ఆరోపణలున్నాయని. వాటిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలు విభాగాల నాయకులు దేవళ్ళ రేవతి, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు.