
సాక్షి, కడప : నగరంలో తెలుగుదేశం నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి తగిన భరోసానిస్తూ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కడప తెలుగుదేశం నేతలు మాత్రం ప్రజాసంకల్పయాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించనున్నట్లు ఫ్లెక్సీ కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్నారు.
తెలుగుదేశం నేతలు తాజాగా కడపలో ర్యాలీ నిర్వహించాలని భావించారు. ఇందులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ స్థానిక నేతలు 'ప్రజాసంకల్పయాత్రకు విచ్చేయుచున్న శ్రీనివాసరెడ్డికి స్వాగతం సుస్వాగతం' అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్ చూసిన కొందరు సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేత చేపట్టిన పాదయాత్రను కాపీ కొట్టడం ఏంటో అంటూ గుసగుసలాడుకుంటున్నారు.