సాక్షి, రామగిరి(అనంతపురం) : రామగిరిలో అవినీతి రాజ్యమేలింది. ఇక్కడ వారు చెప్పిందే వేదం..చేసిందే చట్టం..అధికార పార్టీలో ఉన్నాం..ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. అభివృద్ధి అనే పూతపూసి.. అక్రమాల కాత కాపించారు. పురాతన పాఠశాల భవనంలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి, సుమారు రూ.2లక్షలు నిధులు దుర్వినియోగం చేసి, దాన్ని అప్పటి మంత్రి పరిటాల సునీత చేత ప్రారంభింపజేశారు.
మండలంలోని పోలేపల్లిలో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. దీని ఏర్పాటుకు మెటీరియల్‌ను పరిటాల ట్రస్ట్ అందించగా..పక్కా భవనానికి రూ.2లక్షల పంచాయతీ రాజ్ నిధులను తెలుగు తమ్ముళ్లు కాజేసి పురాతన పాఠశాల భవనంలో వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో మేం అధికారంలోకొస్తే ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించేందుకు వాటర్‌ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తాం అని టీడీపీ హయాంలో అలవిగాని హామీలిచ్చారు. హామీల అమలులో భాగంగా స్థానిక తెలుగు తమ్ముళ్లు మంత్రి పరిటాల సునీత అండ చూసుకొని అధికారులతో పక్కాభవనం నిర్మించినట్లు నిధులను డ్రా చేశారు.
వాటర్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించాలి. అక్కడ ప్రభుత్వ నిధులతో పక్కా భవనాన్ని నిర్మించాలి.వాటర్‌ప్లాంట్‌కు సంబంధించి మెటీరియల్‌ను ఏర్పాటు చేసి, ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ రామగిరి మండలంలో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించారు.
పోలేపల్లి సమీపంలో ఉన్న క్వారీని కర్నూలుకు చెందిన వారు నిర్వహిస్తున్నారు. క్వారీ యజమానులను స్థానిక టీడీపీ నాయకులు బెదిరించి వాటర్‌ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రి కోసం రూ.2లక్షలు లాక్కొని పరిటాల ట్రస్ట్ పేరుతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆదిరెడ్డి, ఓబిరెడ్డి, నాగిరెడ్డి, జయచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డితోపాటు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ విషయమై పంచాయతీరాజ్ జేఈ మల్లికార్జునను అడగ్గా తాను రామగిరి జేఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టానన్నారు. ఎంఈఓ రాజశేఖర్‌ను వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నానని, ఈ విషయంపై తనకేమీ తెలియదని దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment