వరంగల్, న్యూస్‌లైన్: టీడీపీ అధక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సోమవారం నుంచి చేపట్టనున్న ఆమరణ దీక్ష... జిల్లాలోని ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది. తెలంగాణ కోసం ఏనాడో లేఖ ఇచ్చామని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు... విభజన తర్వాత మాటమార్చడం వారికి ఇప్పటికే ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను రోజువారీగా విశ్లేషించేందుకంటూ స్ట్రాటజీ కమిటీ వేయడం... తాను చేపట్టనున్న దీక్షకు తెలంగాణ నేతలు అధిక సంఖ్యలో రావాలని టీడీపీ అధ్యక్షుడు ఆదేశాలివ్వడం ఆ పార్టీకి చెందిన జిల్లా నేతలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా నిన్నమొన్నటి వరకు ఎడమొహం.. పెడమొహంగా ఉన్న టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయూకర్ రావు, ప్రజాపద్దుల సంఘం మాజీ చైర్మన్ రేవూరి ప్రకాష్‌రెడ్డికి స్ట్రాటజీ కమిటీలో చోటు కల్పించి.. దేశ రాజధానికి తప్పకుండా రావాలని ఆదేశించడం వారికి మింగుడుపడడం లేదు. పోతే ఎలా... పోకపోతే ఎలా అని తమ తమ అనుచర వర్గాల ద్వారా వారు ఆరా తీస్తుండడమే ఇందుకు నిదర్శనం.
ఢిల్లీకెళ్తే తెలంగాణలో తిరగడం కష్టమే...
ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసే అంశంపై చంద్రబాబు శనివారం సీమాంధ్ర, తెలంగాణ నేతలతో రాత్రి వరకూ సమావేశమయ్యారు. ఈ దీక్షతో తెలంగాణ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేక వస్తుందని ఎర్రబెల్లి, రేవూరి ఆయన వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. విభజన జరుగుతున్న తీరు... ఇప్పుడు జరుగుతున్న సీమాంధ్ర ఉద్యమం... నష్టం వంటి వ్యవహారాలపైనే దీక్ష చేస్తున్నానని, మద్దతుగా తెలంగాణ నుంచే పార్టీ నేతలు ఎక్కువగా రావాలని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో ఇరుప్రాంతాల్లో జరుగుతున్న రోజువారీ పరిస్థితులను తెలుసుకునేందుకే రెండు ప్రాంతాల నుంచి ఏడుగురి చొప్పున కమిటీని వేస్తున్నట్లు వారికి వివరించినట్లు సమాచారం. అరుుతే తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ... విభజనతో జరుగుతున్న నష్టంపైనే దీక్ష అని బాబు చెబుతున్న సమాధానం తికమకగా ఉండడంతో తెలంగాణ నేతలు తలపట్టుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబుతో దీక్షకు కూర్చుంటే... ఏ మొహంతో గ్రామాల్లోకి వెళ్తామని నేతలే ప్రశ్నించుకుంటున్నారు.విభజనపై వివరిస్తామని కొత్తగా చెబుతున్నా చివరకు తెలంగాణకు వ్యతిరేకమనే భావన వస్తుందని... ఈ పరిస్థితుల్లో అధినేతతో ఢిల్లీకి వెళ్తే... తిరిగి తెలంగాణ ప్రాంతంలో తిరగడం కష్టమేనని భాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇక చంద్రబాబు దీక్షకు మద్దతుగా నేడు ఢిల్లీకి వెళ్తామని... విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ప్రచారం చేస్తామని రేవూరి ప్రకాష్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు చెప్పారు.
చంద్రబాబు దీక్షతో.. టీడీపీ నేతల్లో కలవరం
Published Sun, Oct 6 2013 6:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement