హోదా కోసం అఖిలపక్షం అవసరం లేదు
రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నపుడు డెడ్‌లైన్లు సరికాదు: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ తయారు చేస్తున్న ఈ సమయంలో డెడ్‌లైన్లు పెట్టడం సరికాదన్నారు. అసెంబ్లీ గురువారానికి వాయిదా పడిన అనంతరం బుధవారం శాసనసభ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15 నుంచి చేస్తానంటున్న నిరవధిక నిరాహారదీక్షలో చిత్తశుద్ధి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని రాజకీయం చేయాలని ప్రతిపక్షం చూస్తోందన్నారు. గతంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకించారని, ఇపుడు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్న సీఎం.. సాగునీటి ప్రాజెక్టుల వంటి మంచి అంశాలను రాజకీ యం చేయటం సరికాదన్నారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరందిస్తామని పునరుద్ఘాటించారు. జగన్ సొంతూరుకు కూడా నీరందిస్తాం, అపుడు ఏం చెప్తారు, మేం వద్దన్నా నీరిచ్చారని చెప్తారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సాహసించలే ని వ్యక్తి ఏం సాధిస్తారని అన్నారు.
సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులు పార్టీలో చేరండి
ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న బలమైన మంచి వ్యక్తులకు టీడీపీ ఆహ్వానం పలుకుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఈదర మోహన్ టీడీపీలో చేరారు. వారికి చంద్రబాబు పచ్చ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రసంగించారు.