బాబుపై టీటీడీపీ నేతల గుస్సా!
♦ రేవంత్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై అసంతృప్తి
♦ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా గుర్తింపు లేదన్న విమర్శ
♦ డబ్బులు - లాబీయింగ్ ఒక్కటే అర్హతా అని ప్రశ్నిస్తున్న నేతలు
♦ తమదారి తాము చూసుకుంటామంటున్న నాయకులు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ తెలంగాణ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కొత్త కమిటీ ఏర్పాటుపై పార్టీలో మెజారిటీ నాయకులు ఏ మాత్రం సంతోషంగా లేరని సమాచారం. పాతికేళ్లకు పైగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను పక్కన పెట్టి కేవలం డబ్బులతో లాబీయింగ్ చేయగలుగుతాడనుకున్న రేవంత్‌రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కట్టబెట్టడాన్ని తప్పు పడుతున్నారు. పేరుకు ఎల్.రమణకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించినా, ఆయనను డమ్మీ చేయడం కోసమే రేవంత్‌ను తెరపైకి తెచ్చారన్న వాదన కూడా వినిపిస్తున్నారు.
ఈ విషయమై కొందరు సీనియర్ నేతలు నేరుగా చంద్రబాబు వద్దే తమ అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం. అధినేతే స్వయంగా పార్టీలో అంతర్గత పోరుకు, అసంతృప్తులకు కారణమయ్యారని ఓ నేత ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముందు నుంచీ రేవంత్‌రెడ్డికి అందలం వేయాలని భావించారన్నది సీనియర్ నాయకుల ప్రధాన అభియోగం. నాలుగునెలల కిందట జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు కోసం రేవంత్ కోట్ల రూపాయలు పోగేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కు రూ.5కోట్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుని అడ్వాన్సుగా రూ.50 లక్షలు ఇస్తూ ఆయన ఏసీబీకి అడ్డంగా దొరికి పోయారు. రేవంత్‌పై ఇంత పెద్ద మచ్చ ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘భవిష్యత్తులోనూ ఇదే స్థాయి లాబీయింగ్ చేయడానికి పనికొస్తాడని అందలం ఎక్కించారా..? పార్టీ కోసం నాయకులు ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నా, పనిగట్టుకుని రేవంత్‌రెడ్డిని ఎందుకు ఎక్స్‌పోజ్ చేశారు.. ఎందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు...’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు మండిపడ్డారు.
సీనియర్లకు మనస్తాపం
పార్టీకి సుదీర్ఘసేవలు అందించిన పలువురు సీనియర్లకు మనస్తాపం కలిగించేలా రాష్ట్ర కమిటీ కూర్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్‌రెడ్డి సిఫారసు చేసిన వారికే రాష్ట్ర కమిటీలో పదవులు దక్కాయన్న విమర్శలూ వస్తున్నాయి. సీబీఐ డెరైక్టర్‌గా, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కె.విజయరామారావుకు ఏ కమిటీలోనూ ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటున్నారు. ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యునిగా తీసుకోవాలని ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ‘నాయకత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. పార్టీ పరువు తీసిన వారికి అందలం వేసి, పార్టీ విలువను పెంచిన వారిని పక్కన పెట్టారు. ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే, మేము పార్టీలో కొనసాగడంలో అర్థం లేదు... మా దారి మేము చూసుకోవడం మినహా మరో మార్గం లేదు..’ అని పార్టీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులకు గవర్నర్ పదవి ఇప్పిస్తోందని ఊదరగొట్టారు. మరి ఆ స్థాయి నేత అయితే, పార్టీ కమిటీల్లో పెద్దగా ప్రాధాన్యం ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో సీనియర్లను దూరం చేసుకునేందుకు తమ గొయ్యి తామే తవ్వుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసు కేసులు ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చి, పార్టీలో క్లీన్ ఇమేజ్ ఉన్నవారికి చెయ్యిచ్చారని తెలంగాణ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. మొత్తంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీ కూర్పుతో చంద్రబాబు, రేవంత్‌ను అందలం ఎక్కించినా, మిగతా నేతల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.