
మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై రాయితో దాడికి యత్నిస్తున్న టీడీపీ నాయకుడు గోగుల రమేష్
విజయనగరం మున్సిపాలిటీ: ఆక్రమించేసుకున్నారు... అడిగితే దౌర్జన్యానికి తెగబడతున్నారు... తామే చెప్పిందే వేదమంటూ నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అధికార టీడీపీకి చెందిన నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వారు చెప్పిందే వేదంగా నడుచుకోవాలంటూ అధికార యంత్రాంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు చర్యలకు ఉపక్రమిస్తే చివరికి వారిపై దాడులకు తెగబడేందుకు యత్నిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీలో జరుగుతున్న అధికార దాష్టీకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా... అధికార పార్టీ నేతల తీరుపై అధికారులు ఫిర్యాదు చేస్తున్నా.. ఉన్నతాధికారులు, పాలక పెద్దలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విశేషం. ఇదే అదనుగా భావిస్తున్న అధికార పార్టీకి చెందిన చోటా, మోటా నేతలు తమకు ఎటువంటి పదవులు లేకున్నా కేవలం పార్టీ పేరు చెప్పుకుని దందాలు సాగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
పార్క్ స్థలంలో ఇంటి నిర్మాణం
మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో గల పద్మావతినగర్ లే అవుట్‌లో సర్వే నంబర్ 115/3లో సుమారు వెయ్యి గజాల స్థలం పార్క్ కోసం కేటాయించారు. గజం ధర ప్రస్తుతం రూ. 17 వేలు పలుకుతోంది. ఈ ఖరీదైన స్థలంపై అధికార పార్టీ నాయకుడు కన్ను పడింది. ఆ స్థలం పూర్తిగా మున్సిపాలిటీ ఆధీనంలో ఉండగా... 21వ వార్డు టీడీపీ అధ్యక్షుడు గోగుల రమేష్ తన బీనామీ అయిన బి.నిర్మలాదేవి పేరిట అందులోని 160 గజాల స్థలాన్ని అక్రమించుకుని ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ రుణం పొంది మరీ ఇంటిని నిర్మిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు ఇంటి నిర్మాణం ప్రారంభ సమయంలోనే పలు మార్లు అడ్డగిం చారు. స్థలం ధ్రువపత్రాలు చూపించాలని అడిగారు. ఈ దశలో నిర్మలాదేవితో పాటు గోగుల రమేష్ అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి.. ప్రభుత్వ సెలవు దినాలు, రాత్రి వేళ్లల్లో నిర్మాణం చేపట్టారు. అయితే ఈ విషయం మున్సిపల్ కమిషనర్ టి.వేణుగోపాల్ తెలియడంతో ఇంటి నిర్మాణాన్ని తొలగించాలని టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో శనివారం ఉదయం టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జేసీబీ యంత్రం తో మున్సిపల్ పార్క్ స్థలంలో నిర్మిస్తున్న భవనాన్ని తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు.
రాయితో దాడికి యత్నం
ఇంటిని తొలగించడానికి వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై టీడీపీ 21వ వార్డు అధ్యక్షుడు గోగుల రమేష్ రాయితో దాడికి యత్నించారు. మహిళా సిబ్బంది అని చూడకుండా దుర్భాషలాడారు. తానే ఈ వార్డుకు కౌన్సిలర్‌లను అంటూ తన పరిధిలో జరుగుతున్న నిర్మాణాన్ని తొలగించేందుకు మీకేం అధికారం ఉందంటూ ఎదురుదాడికి యత్నించారు. ఊరిలో ఇంకేం కనిపించలేదా...? ఇదొక్కటే కనిపించిందా...? మున్సిపాలిటీ కాదు... గిన్సిపాలిటీ కాదు.... ఎక్కడ తేల్చుకోవాలో.... అక్కడే తేల్చుకుంటా..? కేసు పెట్టాలనుకుంటే పెట్టుకోండంటూ హల్‌చల్ చేశారు. ఆక్రమిత స్థలంలో నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించడంతో తాము చర్యలు చేపట్టామని సిబ్బంది చెబుతుండగా.. రమేష్ కలుగజేసుకుని కనీసం నోటీసులు జారీ చేయకుండా ఎలా పడగొడతారంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకోవడం పెద్ద నేరమని, ఈ విషయంలో నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని సిబ్బంది చెప్పడంతో గోగుల రమేష్ ఆగ్రహంతో ఊగిపోయారు.
కౌన్సిలర్‌నంటూ హల్‌చల్
మున్సిపాలికి 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 21వ వార్డు కౌన్సిలర్‌గా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సతీమణి కోలగట్ల వెంకటరమణి ఎన్నికయ్యారు. అయితే ఆమె ప్రతిపక్షంలో ఉండగా.....అధికార పార్టీకి చెందిన వార్డు అధ్యక్షుడు గోగుల రమేష్ తానే కౌన్సిలర్‌ను అంటూ చెప్పుకుంటూ హల్‌చల్ చేయడం గమనార్హం. పద్మావతినగర్‌లో జరిగిన సంఘటన పరిశీలిస్తే అధికార టీడీపీ నాయకులకు ఎటువంటి పదవులు లేకున్నా అధికారులపై పెత్తనం చెలాయిస్తూ ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది.
గతంలోనూ దాడులు
అక్రమ భవన నిర్మాణాల తొలగింపు విషయంలో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారులపై అధికార టీడీపీ పార్టీకి చెందిన నాయకులు దాడులకు తెగబడడం కొత్తేమి కాదు. 2017 నవంబర్‌లో ఏకంగా మున్సిపల్ కార్యాలయంలోని తమ విభాగంలో కూర్చున్న అధికారులు, సిబ్బందిపై అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ నాయకత్వంలో టీడీపీ నాయకులు దాడికి యత్నించారు. తమ పార్టీకి చెందిన నాయకుడు ఫ్లెక్సీని తొలగించడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చానీయాంశం కాగా....దాడిపై కలెక్టర్‌కు కూడా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఇలా అధికార పార్టీకి చెందిన నాయకులే తమపై దాడులకు దిగుతుంటే విధులు ఎలా నిర్వహించాలన్న వాదన అధికారుల నుంచి వ్యక్తమవుతోంది.
అది మున్సిపల్ స్థలమే..
21వ వార్డు పద్మావతినగర్‌లో గల సర్వే నంబర్ 115/3లో ఉన్న స్థలం మున్సిపల్ పార్క్‌దే. అందులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ముందుగానే హెచ్చరించాం. అయినా వారు మాట వినకుండా నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కూల్చివేతకు ఆదేశాలిచ్చాను. అయితే నిర్మాణదారులు ఆ స్థలం తమదంటూ చెప్పుకొస్తున్నారు. ఇదే తరహాలో గతంలో వ్యవహరించగా... అప్పటి కమిషనర్ విచారణ జరిపించి పార్క్ స్థలంగా నిర్ధారించారు.
– టి.వేణుగోపాలరావు, కమిషనర్,
విజయనగరం మున్సిపాలిటీ.