
టీడీపీలో బాలయ్య పీఏ చిచ్చు
అనంతపురం: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అనంతపురం జిల్లా. ఆ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు వర్గ పోరు మరోసారి రచ్చ కెక్కింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన... ప్రస్తుతం ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆ నియోజకవర్గంలోని చిలమత్తూరు గ్రామంలో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఎంపీపీ నౌదియా బానుతో పాటు మరో వర్గం నాయకుడు బ్రహ్మానందరెడ్డి ... ఆయన వర్గీయులు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సమావేశంలో బ్రహ్మానందరెడ్డి వర్గీయులు ఆరోపించారు. దాంతో నౌదియ బాను వర్గీయలు.. బ్రహ్మానందరెడ్డి వర్గీయులను వారించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కుర్చీలతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాంతో సమావేశం కాస్త రసాభాసగా మరింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని శాంతిప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.