టీడీపీలో అంతర్గత పోరు | TDP Leaders Internal fight In West Godavari District | Sakshi
Sakshi News home page

టీడీపీలో అంతర్గత పోరు

Published Sun, Nov 25 2018 9:01 AM | Last Updated on Sun, Nov 25 2018 9:01 AM

TDP Leaders Internal fight In West Godavari District - Sakshi

తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ సీటు ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు విభేదాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావుకు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం కాళ్ల జెడ్పీటీసీ పార్టీకి రాజీనామా చేశారు. నెల క్రితం పెరవలి జెడ్పీటీసీ కూడా పార్టీని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మధ్య వివాదం నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలోని ఆగర్రులో శనివారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ అంగరతోపాటు జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. శుక్రవారం రాత్రి అన్న క్యాంటిన్‌ వద్ద జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే రామానాయుడు చేస్తున్న అవినీతి అక్రమాలపై అంగర రామమోహన్‌ అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గతంలో కాంట్రాక్టర్లు మామూళ్లు ఇవ్వలేదని వారిపై కేసులు నమోదు చేయించి పోలీసు స్టేషన్లో పెట్టించిన వైనంపై కూడా ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఏ ఏ కాంట్రాక్టర్‌ వద్ద ఎంతెంత వసూలు చేశారన్న విషయాన్ని కూడా అధిష్టానం వద్ద ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పెట్టినట్లు సమాచారం. కాళ్ల జెడ్పీటీసీ వ్యవహారం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారతారనే అనుమానంతో పాత కేసులు బయటకు తీసి జెడ్పీటీసీ భర్తను నల్లజర్ల పోలీసులు అరెస్టు చేయడం, జెడ్పీటీసీ అక్కడ ధర్నా చేయడం తెలిసిందే. తన భర్త అక్రమ అరెస్టు వెనుక జెడ్పీ ఛైర్మన్‌ బాపిరాజు ఉన్నారని ఆరోపిస్తు కాళ్ల జెడ్పీటీసీ వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కల్యాణ్‌ పర్యటన సమయంలో పెరవలి జెడ్పీటీసీ తెలుగుదేశానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. నియోజకవర్గాల్లో కూడా గ్రామస్థాయి నాయకులు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటం ఆ పార్టీని కలవరపెడుతోంది.

మరోవైపు ఎమ్మెల్యేలు కూడా వచ్చే ఎన్నికల్లో ఎలా ప్రజల్ని తమవైపు తిప్పుకోవాలనే విషయంపై దృష్టి పెట్టి పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ్యత్వాల నమోదును కూడా పక్కన పెట్టేశారు. జిల్లాలో ఎనిమిది లక్షల సభ్యత్వాల నమోదు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 2లక్షలు మాత్రమే అయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం అవుతుంది. దీనిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాలకొల్లులో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఇన్‌ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏలూరు, చింతలపూడి, దెందులూరు, గోపాలపురం, కొవ్వూరు, నిడదవోలు, భీమవరం ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాలేదు. చింతలపూడి ఏఎంసీ వ్యవహారంలో తమను పక్కన పెట్టి ఎంపీ వర్గానికి పదవి కట్టబెట్టడంపై ఎమ్మెల్యే పీతల సుజాత అసంతృప్తిగా ఉన్నారు.  దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వివాదాలపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి చింతమనేని దూరంగా ఉన్నట్లు తెలిసింది. 

అక్రమార్కులకు అండగా
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి చోటా ఎమ్మెల్యేలు, వారి అనుచరులే ఈ ఇసుక దందాలో ప్రత్యక్షంగా ఉంటున్నారు. వీటిపై అడపాదడపా విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు మళ్లీ వెనక్కి ఇచ్చేయాలని సమన్వయ కమిటీలో నిర్ణయించారు. పోలీసులు సీజ్‌ చేసిన ట్రాక్టర్లన్నీ అధికార పక్షానికి చెందిన వారివే కావడంతో ట్రాక్టర్లు యజమానుల్లో ఎక్కువ మంది ఎస్సీ, బీసీ వారు ఉన్నారన్న సాకు చూపించి వాటిని యజమానులకు అప్పగించడానికి తీర్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement